ఆ యాడ్ చేసినందుకు క్షమాపణ చెప్పాడు

బాలీవుడ్ సృజనాత్మక దర్శకుడు సంజయ్ లీల భన్సాలి పుణ్యమా అని రణవీర్ సింగ్, దీపికా పదుకొనె లు వెండితెర పై కనిపించే యువ జంటలలో అగ్ర స్థానంలో నిలిచారు. సంజయ్ లీల భన్సాలి తెరకెక్కించిన రాంలీలా గోలియామ్కి రాసలీల, బాజీరావు మస్తానీ చిత్రాలు ఈ యువ జంట ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీని అద్భుతంగా ఆవిష్కరించాయి. ప్రేక్షకులు ఈ క్రెడిట్ మొత్తాన్ని భన్సాలీకి ఇచ్చేయగా, బాలీవుడ్ వర్గాలు మాత్రం నిజ జీవితంలో వారి మధ్య ఏదో వ్యక్తిగత అనుబంధం లేకపోతే తెరపై ఇంత ఇంటిమసీ ప్రదర్శిస్తారు అని అనుమానాలు వ్యక్తం చేసారు. ఇక రణవీర్, దీపికాలు వ్యక్తిగత విషయాలు పక్కన పెడితే దీపికా తో పాల్గొన్న ఎన్నో ప్రెస్ మీట్లలో రణవీర్ తనకు ఆడవారు అంటే చాలా గౌరవం అని, వ్యక్తిగతంగానూ, వృత్తిపరంగానూ వారిని ఎప్పుడూ కించపరచనని స్టేట్మెంట్లు ఇచ్చాడు.
ఇటీవల జాక్ అండ్ జోన్స్ సంస్థ వారి వాణిజ్య ప్రకటనలో కనిపించిన రణవీర్ సింగ్ ఇప్పుడు తల బాదుకునే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఆ వాణిజ్య ప్రకటన పోస్టర్లో రణవీర్ ఒక యువతిని భుజంపై ఎత్తుకుని వెళ్తూ దర్శనమిచ్చాడు. "పని పూర్తి కాకపోతే నిర్మొహమాటంగా కార్యాలయం నుంచి ఇంటికి కూడా తీసుకెళ్లండి." అనే అర్ధంతో టాగ్ లైన్ ఆ పోస్టర్స్ లో ప్రచురించారు. ఈ పోస్టర్ తో సగటు స్త్రీ మనోభావాలు దెబ్బ తినేలా రణవీర్ సింగ్ ప్రవర్తించారు అంటూ నెటిజెన్ల ఆగ్రహం తార స్థాయికి చేరింది. రణవీర్ చర్యను వ్యతిరేకించిన నెటిజన్లలో హీరో సిద్దార్ధ్ కూడా ఉండటం విశేషం. సదరు వాణిజ్య సంస్థకి ఆ పోస్టర్స్ తక్షణమే ఉపసంహరించుకుంటున్నట్లు ఆల్రెడీ ప్రకటించింది. ఈ పోస్టర్ ఊహించని వివాదం కావటంతో కళ్ళు తెరుచుకుని వాస్తవ ప్రపంచంలోకి తొంగి చూశాడో ఏమో రణవీర్. సోషల్ మీడియా ద్వారా మహిళలందరిని ఉద్దేశించి క్షమాపణ కోరాడు. మరి ఈ వివాదం ఇంతటితో ముగుస్తుందో లేక రణవీర్ సింగ్‌ని మరి కొంత కాలం వెంటాడుతుందో చెప్పటం ఇప్పటికి కష్టమే.

