ఆ డైరెక్టర్ రాజకీయాలవైపు మళ్లుతున్నాడా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ సినిమాలకు పెట్టింది పేరు అయినప్పటికీ కొన్ని క్లాస్ సినిమాలను కూడా తెరకెక్కించాడు ఆ డైరెక్టర్. ఎన్ని హిట్ సినిమాలు చేసినా ఇప్పుడాయన చేతికి స్టార్ హీరోనే దొరకడంలేదు. చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ 'ఖైదీ నెంబర్ 150 ' వంటి హిట్ చిత్రం చేసినా కూడా ఆయన చేతిలో ఇప్పుడు సరైన సినిమానే లేదు. ఇప్పుడర్ధమయ్యిందా ఆ డైరెక్టర్ ఎవరనేది. ఆయనేనండీ వి వి వినాయక్. చిరంజీవికి అంత పెద్ద హిట్ ఇచ్చినప్పటికీ.... వినాయక్ దగ్గర ఒక మంచి కథ ఉన్నప్పటికీ ఆయన డైరెక్టన్ లో నటించేందుకు ప్రస్తుతానికి స్టార్ హీరోలెవరు ఖాళీగా లేరు. అందుకే వినాయక్, సాయి ధరమ్ తేజ వంటి చిన్న హీరో సినిమాకు కమిట్ అయ్యాడు. తాజాగా వినాయక్ - సాయి ల చిత్రం చిరు ఆశీస్సులతో ప్రారంభమైన సంగతి తెలిసిందే.
అయితే బాక్సాఫీస్ సెన్సేషన్‌గా పేరున్న వి.వి.వినాయక్ రాజకీయాల్లోకి వస్తున్నారా? అంటే అవుననే సమాచారం బయటికి వచ్చింది. ఆ మేరకు సదరు స్టార్ డైరెక్టర్ స్వయంగా తన పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రకటించి షాక్ ఇచ్చారు. దేవుడు శాసిస్తే రాజకీయాల్లోకి వస్తాను. అసలు డైరెక్టర్నవుతాననుకోలేదు. అయినా అయ్యాను. రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్నా.. ఇప్పటికి వెళ్లే టైమ్ వచ్చిందని అంటూ వినాయక్ ప్రకటించడం ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషమే కాదు ఒక సెన్సేషన్ కూడా. అయితే ఈ విషయాన్ని వినాయక్ నిజంగా చెప్పారో? లేకుంటే సరదాగా అన్నారో? గాని ఇప్పుడు వినాయక్ పొలిటికల్ ఎంట్రీ అనే న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది.
అయితే వినాయక్ ఈ విషయాన్నీ వెస్ట్ గోదావరి తిమ్మరాజు పాలెం వెళ్ళినప్పుడు చెప్పాడు. తిమ్మరాజు పాలెం సర్పంచ్ సత్యవతి ఇటీవల మృతి చెందారు. ఆమె మరణం తర్వాత కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన వినాయక్ అక్కడ లోకల్ మీడియాతో మాట్లాడుతూ తన రాజకీయా రంగ ప్రవేశం గురించి ప్రకటించారు. అయితే వినాయక్ ఏ పార్టీలో చేరతారు? ఒకవేళ వినాయక్ రాజకీయాల్లోకి వెళితే సినిమాల డైరెక్షన్ ఆపెస్తాడా? అనేది మాత్రం ప్రస్తుతానికి క్లారిటీ అయితే లేదు.

