ఆస్పత్రిలో అమ్మ : ఆందోళనలో తలైవా

తమిళనాడులో సీఎం పురట్చి తలైవి జయలలితకు, ఆమెతో సమానంగా జనాదరణ ఉన్న తలైవా రజనీకాంత్ కు మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గు మంటుందని అంతా అనుకుంటూ ఉంటారు. ఒకరి మీద ఒకరు ఆధిపత్యం ప్రదర్శించుకోవడానికి ఇలా చేస్తున్నారంటూ గతంలో కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘటనలు జరిగిన సంగతి కూడా తెలిసిందే.
అయితే ప్రస్తుతం పురట్చి తలైవి జయలలిత అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ఆమె త్వరగా కోలుకోవాలని రజనీకాంత్ ఆమె గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ రజనీకాంత్ ట్వీట్ చేశారు. అర్ధరాత్రి సమయంలో తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న జయలలిత ను అపోలో ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఆమె ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని ఆస్పత్రి వర్గాలంటున్నాయి. ‘‘మీరు త్వరగా ఉపశమనం పొందాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’’ అంటూ రజనీకాంత్ ట్వీట్ పెట్టారు.
రజనీకాంత్ ఇటీవలి కాలంలో వేస్తున్న అనేక అడుగులు.. ఆయన రాజకీయం దిశగా ఆలోచిస్తున్నారా అనే సందేహాలను అభిమానులకు కలిగిస్తున్నాయి. ఇటీవలి కాలంలో వేర్వేరు పార్టీలకు చెందిన కొందరు నాయకులతో ఆయన భేటీ కావడం జరిగింది. తాజాగా జయలలిత కు ట్వీట్ కూడా అలాంటి రాజకీయ సానుకూల ధోరణుల్లో భాగమేనా అని కూడా కొందరంటున్నారు.

