అలా జరిగిందా బండ్ల?

చెల్లని చెక్ ఇచ్చిన కేసులో ఆరు నెలల జైలు శిక్ష పడ్డ బండ్ల గణేష్ కు బెయిల్ లభించింది. దాంతో అతడి అరెస్ట్ నిలిచిపోయిందనే చెప్పాలి. నిన్న సాయంత్రం నుండి హల్ చల్ చేసిన ఈ వార్త పై బండ్ల గణేష్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు.. తన అభిప్రాయాన్ని బండ్ల గణేష్ ట్విట్టర్ ద్వారా తెలుపుతూ 2015 టెంపర్ చిత్రం వివాదం ఇది… కోటి నాలుగు లక్షల రూపాయలకు టెంపర్ కథా హక్కులను రచయిత వంశీ నుండి కొనడం జరిగింది. సినిమా సూపర్ హిట్ అయిన తరువాత హిందీ రీమేక్ హక్కులను దర్శక, నిర్మాత అయిన రోహిత్ శెట్టికి సంయుక్తంగా విక్రయించాము. కానీ నాకు తెలియకుండా టెంపర్ నవల హక్కులను రచయిత వంశీ మరొకరికి అమ్మాడు. దీని వలన నేను తీవ్ర మనస్తాపానికి లోనై ఈ విషయాన్ని సినీ ఛాంబర్ దృష్టికి తీసుకువచ్చాను.
అదే సమయంలో టెంపర్ చిత్ర కథకి ఇచ్చిన బ్యాలన్స్ డబ్బుల చెక్ ను నిలిపివేశాను. ఈ వివాదం ఫిల్మ్ ఛాంబర్ లో ఉన్నప్పటికీ వంశీ చెక్ ను పట్టుకొని కోర్టు కి వెళ్ళాడు. నేను కొంత ఉపేక్షించటం వల్ల కోర్టు తీర్పు ఇవ్వటం జరిగింది. అది తెలిసిన నేను కోర్టు ద్వారా బెయిల్ పొందాను. ఈ విషయం పై ఉన్నత న్యాయ స్థానానికి అప్పీల్ కు వెళ్తున్నాను. రచయిత వంశీ పై నా న్యాయ పోరాటం సాగిస్తాను. టెంపర్ సినిమాకు అద్భుతంగా మాటలు రాసి కథను విస్తృత పరిచిన శక్తి ఎవరో, ఏమిటో నాకు నా సినిమా యూనిట్, సినిమా సహాయ రచయితలకు, వంశీ మనసాక్షికి తెలుసు…..సినిమా రంగంలో నటులకు, దర్శకులకు, సాంకేతిక నిపుణులకు కోట్ల రూపాయలు చెల్లించిన నేను తొమిది లక్షల రూపాయలు చెల్లించే స్థితిలో లేనా? నా అభిమానులు, ఆత్మీయులు అర్థం చేసుకొనగలరు.. అంటూ తన స్పందనని రాసుకొచ్చాడు.

