అభిమాన కథానాయిక సరసన నటించే అదృష్టం

చిత్ర పరిశ్రమలో దాదాపు దశాబ్దన్నర కాలం కథానాయికగా కెరీర్ కొనసాగించిన అతి అరుదైన కథానాయికల్లో త్రిష ఒకరు. కొద్ది కాలం క్రితం అవకాశాలు తగ్గుముఖం పట్టగా త్రిష వివాహ వార్తతో సంచలనమైయ్యింది. నిశ్చితార్ధం అనంతరం ఆ సంబంధం పీటల వరకు చేరకముందే బెడిసికొట్టడంతో వృత్తి రీత్యానే కాక వ్యక్తిగత జీవితం కూడా ఇబ్బందిలో పడిపోయింది అని అందరూ త్రిషపై సానుభూతి చూపారు. ఇవేవి తనకు పట్టవన్నట్టు అందరికి మళ్లీ సినిమాల్లో బౌన్స్ బ్యాక్ ద్వారా సమాధానం చెప్పింది త్రిష. తాను చేస్తున్న హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలతోనే కాక, గత సంవత్సరం గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో ఎన్నై ఆరిందాల్(తెలుగులో ఎంతవాడు కానీ), ఈ ఏడాది ధనుష్ సరసన నటించిన కోడి(తెలుగులో ధర్మ యోగి) చిత్రాలతో ప్రేక్షకులపై కొత్త ముద్రను వేసింది.
మరోపక్క ఇండియన్ సూపర్ స్టార్ రజని కాంత్, తెలుగు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల తదుపరి చిత్రాలకు త్రిష తో సంప్రదింపులు జరుగుతున్నాయి. అయితే వీటికన్నా ముందు త్రిష మరో క్రేజీ ప్రాజెక్ట్ అంగీకరించింది. కేరళ ప్రజలకు ఇప్పటి వరకు అనువాద చిత్రాలతో మాత్రమే పరిచయం వున్నా త్రిష ఇప్పుడు నేరుగా మలయాళం లో చిత్రం చేయబోతుంది. తనకన్నా వయసులోనూ, అనుభవంలోనూ చిన్నవాడైన మలయాళం యంగ్ హీరో నివిన్ పౌలి సరసన నటించబోతుంది త్రిష. శ్యాం ప్రసాద్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.
గత ఏడాది మలయాళం ఇండస్ట్రీ హిట్ ప్రేమమ్ చిత్రానికి గాను ఫిలింఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకుంటూ ఆ వేదికపై తన అభిమాన నటి త్రిష అని నివిన్ పౌలి పేర్కొనటం గమనార్హం. ఇప్పుడు నివిన్ పౌలి కి తన అభిమాన నటితో కలిసి తెరను పంచుకునే అవకాశం దొరికింది అన మాట.

