అదరగొడుతున్న యువ హాస్య నటుడు

కొంత కాలం కిందట హాస్యం పండించాలి అంటే బ్రహ్మానందం కి కచ్చితంగా ఒక పాత్ర రూపొందిచేవారు దర్శక రచయితలు. ఆలా బ్రహ్మానందం గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించినా, ఆయన నటనలో మొనాటనీ వచ్చేసి కొంత కాలానికి బ్రహ్మానందాన్ని తెరపై చూసే ఉత్సాహం ప్రేక్షకులలో కరువు అయిపోయింది. ఈ క్రమంలోనే ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్.నారాయణ, ఎ.వి.ఎస్, ఆహుతి ప్రసాద్ వంటి అగ్ర హాస్య నటులు అందరూ కాలం చెందటంతో పోసాని కృష్ణ మురళి, పృథ్వి రాజ్, వెన్నెల కిశోరె, ప్రభాస్ శ్రీను, శ్రీనివాస్ రెడ్డి మరి కొందరు జబర్దస్త్ ఆర్టిస్టులు వెలుగులోకి వచ్చారు.
కాగా వీరిలో ఒక్క వెన్నెల కిశోర్ మినహాయిస్తే మరే కమెడియన్ హీరోల పాత్రలకు స్నేహితుడిగా పూర్తి నిడివి చేయగలిగిన హాస్య నటులు ఎవరు లేరు. ఒకప్పుడు ఈ పాత్రలకు సునీల్ దర్శకులకు అందుబాటులో ఉండేవాడు. ఇప్పుడు ఆయన కథానాయకుడిగా బిజీ కావటంతో కొంత మంది యువ నటులు ఆ స్థాయి కోసం పోటీ పడుతున్నారు. వారిలో సత్య ఒకడు. నాచురల్ స్టార్ నాని నటించిన మజ్ను లో నాని స్నేహితుడిగా చిత్రంలో పూర్తి నిడివి వున్న పాత్రలో అలరించాడు సత్య. తాజాగా నిఖిల్ నటించిన ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రంలోనూ ఎక్కువ స్క్రీన్ టైంతో కనిపించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు.
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఆలస్యంగా జోడించిన రెండు సంభాషణలు సత్య చేతనే పలికించాడు దర్శకుడు విఐ ఆనంద్. ద్వితీయార్ధంలో హీరోయిన్ ఆత్మ వేరొక శరీరంతో వచ్చి సత్య కు ఎదురు పడిన సందర్భాలు చిత్రానికే హైలైట్ గా నిలిచాయి. ఇలానే పూర్తి నిడివి వున్న పాత్రలు సత్యకు తరచు పడుతుంటే అగ్ర స్థాయి హాస్య నటుడిగా అనతి కాలంలోనే వెలుగొందటం ఖాయం.

