ట్రాఫిక్ జామ్ అనస్థీషియా ప్రభావం తగ్గడంతో
అంబులెన్సులో ఆస్పత్రికి తరలిస్తుండగా జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.

అంబులెన్సులో ఆస్పత్రికి తరలిస్తుండగా జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. మహారాష్ట్రలోని ముంబయి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాల్ఘర్ జిల్లాకు చెందిన 45 ఏళ్ల ఛాయా పూరవ్ అనే మహిళ మరణించింది. చెట్టుకొమ్మ విరిగిపడటంతో ఛాయా తీవ్రంగా గాయపడ్డారు. ఆమె పక్కటెముకలు, భుజాలు, తల భాగంలో గాయాలయ్యాయి. స్థానిక ఆసుపత్రి సిబ్బంది ఆమెను ముంబయిలోని హిందుజా ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. 100 కిలో మీటర్ల దూరం కావడం, రెండున్నర గంటల సమయం పడుతుందన్న ఉద్దేశంతో ఆమెకు అనస్థీషియా ఇచ్చారు. మధ్యాహ్నం 3గంటల సమయంలో అంబులెన్సులో బయల్దేరగా ఎన్హెచ్-48లో భారీ ట్రాఫిక్ జామ్లో చిక్కుకుపోయారు. సాయంత్రం ఆరు గంటలైనా కేవలం సగం దూరం మాత్రమే చేరుకోగలిగారు. ఆమెకు అనస్థీషియా ప్రభావం తగ్గడంతో విపరీతమైన నొప్పి భరించలేక విలవిల్లాడిపోయారు. అంబులెన్స్ సిబ్బంది రాత్రి 7 గంటల సమయంలో మీరా రోడ్లోని ఆర్బిట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. ఆమెను పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ప్రకటించారు.

