ప్రకృతికి విరుద్ధంగా వెళ్లారు.. వజ్రాల నగరాన్ని మింగేసిన ఇసుక
నమీబియా దేశంలోని వజ్రాల నగరం గురించి మీకు తెలుసా?

నమీబియా దేశంలోని వజ్రాల నగరం గురించి మీకు తెలుసా? ఒకప్పుడు వజ్రాలకు కేరాఫ్ గా నిలిచిన ఈ నగరంలో ఇప్పుడు ఎవరూ నివసించడం లేదు. ‘కాల్మన్స్కోప్’ నగరం కాలగర్భంలో కలసిపోయింది. వజ్రాల గనులకు నిలయమైన ఆ నగరాన్ని ఇసుక మింగేసింది.
1900 ప్రారంభంలో భారీగా వజ్రాలు దొరికేవి. జర్మనీ తదితర దేశాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు, వర్తకులు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. పెద్ద పెద్ద భవంతులు నిర్మించారు. విలాసాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. ఎడారిలో నిక్షిప్తమై ఉన్న వజ్రాలను వెలికి తీసి, వాటి ద్వారా వచ్చే డబ్బుతో సకల సౌకర్యాలు అనుభవించేవారు. క్రమంగా ఆ ప్రాంతంలో వజ్రాల ఆచూకీ కనుమరుగైంది. కాల్మన్స్కోప్తో పోల్చుకుంటే దక్షిణాదిలో గనుల నుంచి వజ్రాలను వెలికి తీయడం సులభమని భావించి 1950 నాటికి చాలా మంది ఈ నగరాన్ని ఖాళీ చేసేశారు. ఎడారిని చదును చేసి నిర్మించిన నగరాన్ని మళ్లీ అదే ఎడారి మింగేసింది. ఇసుక తుఫాన్లు, గాలులకు అక్కడి ఇళ్లు, ఆస్పత్రులు, ఇతర భవనాల్లో పెద్ద మొత్తంలో ఇసుక పేరుకుపోయింది. అయితే చరిత్ర కారులకు, ఫొటోగ్రాఫర్లకు ఈ నగరం ఇష్టమైన ప్రదేశంగా మారింది.

