కందిలో కొత్త వంగడం.. 45 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా పండించొచ్చు
కందుల పంటకు సంబంధించి కొత్త వంగడాన్ని ఆవిష్కరించింది హైదరాబాద్‌లోని ఇక్రిశాట్.

కందుల పంటకు సంబంధించి కొత్త వంగడాన్ని ఆవిష్కరించింది హైదరాబాద్‌లోని ఇక్రిశాట్. 120 రోజుల్లోనే పంట చేతికి రావడం, ఏడాదిలో మూడు పంటలు పండించుకునే అవకాశం ఉందట. ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోవడం ఈ వంగడం ప్రత్యేకత అని చెబుతున్నారు. ప్రస్తుత రకాలు 6 నెలల పంట కాలంతో ఎకరాకు గరిష్ఠంగా 6 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే ఇస్తున్నాయి. కొత్త వంగడం ఎకరాకు 10 క్వింటాళ్ల మేర దిగుబడి ఇస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఐసీపీవీ 25444
‘ఐసీపీవీ 25444’ వంగడాన్ని ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ హిమాన్ష్‌పాఠక్ ఆవిష్కరించారు. ఇక్రిశాట్లో ఐదేళ్ల విస్తృత పరిశోధన అనంతరం సీనియర్ శాస్త్రవేత్త గంగిశెట్టి ప్రకాశ్ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు బెలియప్ప శ్రుతి, బొమ్మ నరేశ్‌ల బృందం మేలైన కంది రకం ఐసీపీవీ 25444ను అభివృద్ధి చేసింది. తెలంగాణ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో దీనిని పరీక్షించగా మంచి ఫలితాలు వచ్చాయి. ప్రస్తుత రకాలు 35 డిగ్రీల ఉష్ణోగ్రతలను మాత్రమే తట్టుకుంటుండగా.. కొత్త రకం 45 డిగ్రీల ఉష్ణోగ్రతల్లోనూ పండుతుందన్నారు. ఎకరానికి 2 కిలోల విత్తనాలు చాలట!!