భావితరాల భవిష్యత్తును మారుస్తున్న మాస్టర్లు
ప్రభుత్వ స్కూళ్లలో సరైన సదుపాయాలు ఉండవనే అపోహలు చాలా మందిలో ఉన్నాయి

ప్రభుత్వ స్కూళ్లలో సరైన సదుపాయాలు ఉండవనే అపోహలు చాలా మందిలో ఉన్నాయి. ఉచిత విద్య అందిస్తున్నా కూడా తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్లకే పిల్లలను పంపిస్తూ ఉంటారు. అయితే కొందరు ఉపాధ్యాయులు మాత్రం వారు పని చేసే స్కూళ్ల ముఖ చిత్రాన్నే మార్చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.
గత ఏడాది 15 మంది విద్యార్థులు మాత్రమే ఉన్న ఆ పాఠశాలలో ప్రస్తుతం 152 మంది చదువుతున్నారంటే ఓ మాస్టారు తీసుకొచ్చిన మార్పు గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం తాండ్ర బాబాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో కనీస సౌకర్యాలు ఉండేవి కావు. జాదవ్ రాజ్‌కుమార్ గతేడాది జులైలో పాఠశాలకు బదిలీపై వచ్చారు. విద్యార్థులు సంఖ్య పెంపునకు ప్రత్యేక చొరవ చూపారు. సొంత డబ్బులు లక్షన్నర వెచ్చించి ప్రొజెక్టర్, మూడు కంప్యూటర్లు కొనుగోలు చేశారు. ప్రతి రోజూ సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ప్రత్యేక తరగతులు బోధించడం ప్రారంభించారు. బడిబాటలో భాగంగా సహచర ఉపాధ్యాయులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. అందుకే ప్రస్తుత విద్యాసంవత్సరంలో 137 మంది ప్రవేశాలు వచ్చాయి.

