చెట్లలో బంగారం
చెట్లకు బంగారం కాస్తోంది తెలుసా? ‘నార్వేస్ప్రూస్’ అనే ఈ చెట్లకు పదునైన సూదుల్లాంటి ఆకులుంటాయి.

చెట్లకు బంగారం కాస్తోంది తెలుసా? ‘నార్వేస్ప్రూస్’ అనే ఈ చెట్లకు పదునైన సూదుల్లాంటి ఆకులుంటాయి. వీటి కొసల్లో బంగారు రేణువులు ఉత్పత్తవుతున్నాయి. వీటిని బయటకు తీసి ప్రత్యేక పద్ధతిలో ప్రాసెసింగ్ చేస్తే బంగారం ఉత్పత్తి అవుతుందని అంటున్నారు. ఫిన్లాండ్లోని అడవుల్లో ఈ చెట్లున్నాయి. ఉత్తర ఫిన్లాండ్లోని కిట్టిలా గోల్డ్‌మైన్ సమీపంలో ఉన్న 23 చెట్లపై జియాలజికల్ సర్వే ఆఫ్ ఫిన్లాండ్, ఔలు విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. 138 రకాల ఆకుల శాంపిళ్లు సేకరించి మైక్రోస్కోప్ ద్వారా పరిశీలించారు. నేల లోపల ఉండే బంగారం వేర్లు పీల్చుకునే నీటి ద్వారా చెట్ల ఆకుల్లోకి వస్తోందని, అక్కడ ఘనరూపంలో అత్యంత సూక్ష్మకణాలుగా మారుతోందని శాస్త్రవేత్తలు తేల్చారు. నేలలోంచి బంగారం చెట్ల వేర్ల ద్వారా ఆకుల్లోకి చేరే క్రమంలో ఎండోఫైట్స్ అనే బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు ప్రధానపాత్ర పోషిస్తున్నట్లు కనుగొన్నారు. అయితే అన్ని స్ప్రూస్ చెట్లకు ఈ బంగారు లక్షణాలు లేవు. నీటి ప్రవాహమార్గాలు, సూక్ష్మజీవులు, నేల స్వభావం అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లోని స్పూస్ చెట్లకే ఈ బంగారం కాస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

