ఒంటె కన్నీటితో పాముల విషానికి విరుగుడు
ఒంటె కన్నీరులో ఔషధ గుణాలు ఉన్నాయని, పాము విషానికి విరుగుడుగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఒంటె కన్నీరులో ఔషధ గుణాలు ఉన్నాయని, పాము విషానికి విరుగుడుగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. 26 రకాల పాముల విషాలను సైతం తట్టుకునేంత అద్భుతమైన శక్తిసామర్థ్యాలు ఒంటె కన్నీటికి ఉన్నాయని ఒక పరిశోధనా బృందం చెబుతోంది. దుబాయ్‌లోని సెంట్రల్ వెటర్నరీ రీసెర్చ్ లేబొరేటరీస్ లోని శాస్త్రవేత్తల బృందం ఈ అధ్యయనం చేసింది. పాముకాటు విరుగుడు మందు తయారీలో ఒంటె కన్నీటి నుంచి సేకరించిన పోషకాలు పని చేశాయట.
బ్యాక్టీరియా కణ గోడలను ధ్వంసం చేసి వాటిని చంపేసే రోగనిరోధక శక్తి ఉండే ప్రోటీన్లు ఒంటె కన్నీటిలో పుష్కలంగా ఉన్నాయని, ఈ కన్నీటి సాయంతో అత్యంత శక్తివంతమైన పాముకాటు విరుగుడు మందును తయారుచేయొచ్చని పరిశోధకులు చెప్పారు. ఒంటె కన్నీళ్లలో పాముకాటును తట్టుకునే యాంటీబాడీలు అధికంగా ఉన్నట్లు తమ పరిశోధనలో తేలిందన్నారు. ఎకీస్ కారినాటస్ సోచిరేకీ అనే విషపూరితమైన పాము నుంచి విషాన్ని బయటకు తీసి క్యామలస్ డ్రోమిడేరియస్ రకం ఒంటెకు స్వల్పస్థాయిలో ఎక్కించారు. విషానికి ఒంటె రక్తం, కన్నీరు ఎలా స్పందిస్తున్నాయో అధ్యయనం చేశారు.