127 ఏళ్ల తర్వాత భారతదేశానికి బుద్ధుడి అవశేషాలు
భారత్ నుంచి తరలిపోయిన బుద్ధుని పవిత్ర అవశేషాలను 127 ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి తీసుకొచ్చారు.

భారత్ నుంచి తరలిపోయిన బుద్ధుని పవిత్ర అవశేషాలను 127 ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి తీసుకొచ్చారు. 1898 సంవత్సరంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని పిప్రాహ్వా ప్రాంతంలో పురావస్తు తవ్వకాలు జరిగాయి. ఆ తవ్వకాల్లో బుద్ధుని పవిత్ర అవశేషాలు బయట పడ్డాయి. నాటి బ్రిటన్‌పాలకులు భారత్ నుంచి ఈ అవశేషాలను యూకేకు తరలించారు. నేపాల్ సరిహద్దులోని పిప్రాహ్వా లో బౌద్దమతానికి సంబంధించిన పురాతన స్తూపం ఉంది. అక్కడ జరిపిన తవ్వకాల్లో భూగర్భంలో పెద్ద రాతిపెట్టెలో కొన్ని అవశేషాలు బయటపడ్డాయి. ఇందులో బుద్ధునికి సంబంధించినవిగా భావిస్తున్న అవశేషాలు, సున్నపురాయి పేటిక, బంగారు ఆభరణాలు, రత్నాలు వంటివి ఉన్నాయి. బుద్ధుని నిర్యాణం తర్వాత బుద్దుని అవశేషాలను ఆనాటి రాజ్యాల రాజులకు పంపిణీ చేసేందుకు అవశేషాలను కొన్ని భాగాలుగా విభజించారు. అందులో కొంతభాగాన్ని నేడు థాయ్లాండ్గా పిలుస్తున్న సియామ్ ప్రాంతంలోని రాజుకు అందజేశారు. ఆనాడు తవ్వకాల్లో బయటపడిన సున్నపురాయి మృతపేటిక ప్రస్తుతం కోల్‌కతాలోని ఇండియన్ మ్యూజియంలో ఉంది. గౌతమ బుద్ధుని పవిత్ర అవశేషాలు ఏకంగా 127 సంవత్సరాల అనంతరం మళ్లీ స్వదేశమైన భారత్‌కు తీసుకురావడం దేశ ప్రజలందరికీ ఎంతో గర్వకారణమన్నారు ప్రధాని మోదీ.

