కేదార్ నాథ్ యాత్రకు అంబులెన్స్ ప్లాన్
కేదార్నాథ్ యాత్రలో కొందరు యాత్రికులు అంబులెన్స్‌లను అక్రమంగా వినియోగిస్తూ అడ్డంగా దొరికిపోయారు.

కేదార్నాథ్ యాత్రలో కొందరు యాత్రికులు అంబులెన్స్‌లను అక్రమంగా వినియోగిస్తూ అడ్డంగా దొరికిపోయారు. సోన్‌ప్రయాగ్ వద్ద భారీ క్యూలైన్లను తప్పించుకుని, గౌరీకుండ్ త్వరగా చేరుకోవాలనే దురాశతో రెండు అంబులెన్స్ లను ఉపయోగించారు.
సోన్‌ప్రయాగ్ వద్ద విధుల్లో ఉన్న పోలీసులకు రెండు అంబులెన్స్‌లు అనుమానాస్పదంగా కనిపించాయి. సైరన్లు మోగిస్తూ గౌరీకుండ్ వైపు వెళుతున్నాయి. సాధారణంగా కేదార్నాథ్ ఆలయానికి 16 కిలోమీటర్ల ట్రెక్కింగ్‌కు గౌరీకుండ్ చివరి వాహన ప్రయాణ కేంద్రం. అంతేకాకుండా రోగులను చేర్పించడానికి గౌరీకుండ్‌లో పెద్ద ఆసుపత్రులు లేకపోవడంతో పోలీసులకు అనుమానం బలపడింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, ఆక్రో వంతెన వద్ద అంబులెన్స్‌లను ఆపి తనిఖీ చేశారు. లోపల పేషేంట్స్ ఎవరూ లేరు. సాధారణ యాత్రికుల దుస్తుల్లో ఉన్న ముగ్గురు వ్యక్తులు కనిపించారు. డ్రైవర్లను విచారించగా, ఈ వాహనాలను వైద్య సహాయం కోసం కాకుండా, కేవలం సౌకర్యం కోసం అద్దెకు తీసుకున్నారని తేలింది. ఒక ఏసీ అంబులెన్స్‌ను ఒకే యాత్రికుడు బుక్ చేసుకోగా, మరోదానిలో ఇద్దరు ప్రయాణిస్తున్నారు. దీంతో పోలీసులు ఇద్దరు డ్రైవర్లకు చలాన్లు విధించి, వాహనాలను సీజ్ చేశారు.

