ఇక ఏడాది జైలులోనే గడపనున్న నటి రన్యా రావు
ఎవరేమి చేస్తారులే అని అనుకుందో.. లేక అధికారం పరపతిని వాడుకుందామని అనుకుందో!!

ఎవరేమి చేస్తారులే అని అనుకుందో.. లేక అధికారం పరపతిని వాడుకుందామని అనుకుందో!! ఈజీ మనీకి అలవాటు పడిందో. కన్నడ నటి రన్యా రావు గురించి అధికారులు బయట పెట్టిన విషయాలు దేశాన్నే షాక్ కు గురి చేశాయి.
ఇప్పుడు బంగారం అక్రమ రవాణా కేసులో రన్యారావుకు ఒక ఏడాది జైలు శిక్ష విధించింది బెంగళూరు కోర్టు. రన్యారావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కొట్టేసిన బెంగళూరు కోర్టు తాజాగా ఆమెకు ఒక ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ ఏడాది కాలంలో రన్యారావు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కూడా బెంగళూరు కోర్టు రద్దు చేసింది. దీంతో నటి రన్యారావు ఏడాది పాటు జైలులోనే ఉండనున్నారు. విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ నిరోధక చట్టం కింద ఆమెకు కోర్టు ఏడాది జైలు శిక్షను ఖరారు చేసింది. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయ్ నుంచి 12.56 కోట్ల రూపాయల 14.3 కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులకు నటి రన్యారావు పట్టుబడింది.

