Sun Feb 15 2026 15:39:36 GMT+0530 (India Standard Time)
Shiva Rathri : కిటకిట లాడుతున్న శైవక్షేత్రాలు.. ఈరోజు చేయాల్సిన పనులివీ
నేడు శివరాత్రి. రెండు తెలుగు రాష్ట్రాల్లో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిట లాడుతున్నాయి

నేడు శివరాత్రి. రెండు తెలుగు రాష్ట్రాల్లో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిట లాడుతున్నాయి. శివరాత్రి అంటే లింగోద్భవం జరిగిన పవిత్ర దినంగా భక్తులు విశ్వసిస్తారు. ఈరోజు శివాలయాన్ని దర్శించి లింగాన్ని పాలతో అభిషేకం చేస్తే సకల పుణ్యాలు లభిస్తాయని, ముక్తి లభిస్తుందని నమ్మిక. శివరాత్రి నాడు జాగరణ చేయడం, ఉపవాసాలు ఉండటం వల్ల తమకు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు లభిస్తాయని భక్తులు భావిస్తారు. రాత్రంతా జాగరణ ఉండి శివనామస్మరణ చేస్తే పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. ఆహార నియమాలు, భక్తితో పూజలు చేయడం వల్ల మానసిక ప్రశాంతతకు తోడు అనుకున్న కోరికలు నెరవేరతాయన్నది ఎక్కువమంది భావిస్తారు. అందుకే శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ ఎక్కువ మంది చేస్తుంటారు. రుద్రాభిషేకం, బిళ్వార్చన చేస్తే మరింత శుభకరం.
ఆదివారం రావడంతో...
అందులోనూ ఈసారి ఆదివారం నాడు శివరాత్రి రావడంతో భక్తులు ఈరోజంతా జాగరణ చేసి.. ఉపవాసం ఉండి.. రేపు శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన సోమవారం రోజున శివాలయాన్ని దర్శించుకుని ఉపవాసాన్నిముగిస్తారు. అందుకే ఈ శివరాత్రి ఆదివారం నాడు రావడం ప్రత్యేకత అని పండితులు చెబుతున్నారు. ఇక ఆదివారం నాడు వచ్చే మహా శివరాత్రి నాడు శివారాధనతో పాటు సూర్యారాధన చేయడం మంచిదని కూడా పండితులు చెబుతున్నారు. దీనివల్ల పాపాలన్నీ తొలిగిపోతాయని చెబుతున్నారు. ఎక్కువ మంది ఉదయం శివాలయాలను దర్శించుకుని వచ్చిఇక శివస్త్రోత్రాలు చదువుతూ గడుపుతారు.ఇక శ్రీశైలం, కాళహస్తి, కోటప్పకొండ, వేములవాడ ఆలయాలు నేడు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
శారీరకంగా కూడా...
ఉపవాసం చేస్తే శారీరకంగా మంచి ఫలితాలు వస్తాయని వైద్యులు కూడా చెబుతారు. అందుకే ఏడాదికి ఒక సారి వచ్చేశివరాత్రికి ఉపవాసం చేసినందున కాలేయంలో ఉన్న ఇబ్బందులు తొలిగిపోతాయని, అజీర్ణం వంటి సమస్యలు మాయమవుతాయని, అందుకే ఉపవాసం ఇలా భక్తి రూపంలోనూ మేలు చేస్తుందని వైద్యులు చెబుతుంటారు. శివరాత్రి రోజున జాగరణ చేస్తూ శివారాధనచేస్తే మంచి జరుగుతుందని కూడా పండితులు చెబుతున్నారు.బాధలు తొలిగిపోతాయని, మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని చెబుతారు. అయితే దీర్ఘకాలిక వ్యాధులున్నవారు జాగరణకు, ఉపవాసాలకు దూరంగా ఉండటం మంచిదని, వారు శివారాధన చేసుకోవడం ఉత్తమమని అంటున్నారు.
Next Story

