Wed Jan 28 2026 03:57:56 GMT+0000 (Coordinated Universal Time)
America : మంచు తుపాను మరింత కాలం.. అమెరికా ప్రజలకు హెచ్చరిక
అమెరికా వ్యాప్తంగా మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది.

అమెరికా వ్యాప్తంగా మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. మంగళవారం నాటికి పలు రాష్ట్రాల్లో కలిపి కనీసం 45 మంది ప్రాణాలు కోల్పోయారు. టెక్సాస్‌లోని బోనమ్ సమీపంలో ప్రైవేట్ చెరువులో మంచు పగిలి పడిపోవడంతో ముగ్గురు మృతి చెందారు. ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఆర్కాన్సాస్ నుంచి న్యూ ఇంగ్లాండ్ వరకూ 1,300 మైళ్ల మేర భారీ మంచు కురిసింది. దక్షిణ రాష్ట్రాల్లో పలుచోట్ల మంచు పొరలు ఏర్పడి రహదారులు ప్రమాదకరంగా మారాయి.విద్యుత్ కోతలు, విమాన రద్దులతో ప్రజల అవస్థలు పడుతున్నారు. టెన్నెస్సీ, ఆర్కాన్సాస్, నార్త్ కరోలైనా వరకూ ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థాయికి చేరాయి. ఉత్తర ఫ్లోరిడాలో ఉష్ణోగ్రతలు మైనస్ 3.9 డిగ్రీల సెల్సియస్ వరకూ పడిపోయే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
విద్యుత్తు సరఫరా పునరుద్ధరణకు...
చలి ప్రభావంతో 4.48 లక్షల ఇళ్లు, వ్యాపార సంస్థలకు విద్యుత్ నిలిచిపోయింది. టెన్నెస్సీ, మిసిసిప్పీలో కోతలు అధికంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణకు రోజులు పట్టవచ్చని అధికారులు చెప్పారు.విమాన రాకపోకలు కూడా అస్తవ్యస్తమయ్యాయి. గత వారాంతంలో 17 వేలకుపైగా విమానాలు రద్దయ్యాయి. సోమవారం 7 వేల విమానాలు రద్దుకాగా, మంగళవారం మరో 2,800 విమానాలు రద్దయ్యాయి. బుధవారం 400లోపు రద్దులు ఉండొచ్చని అంచనా.చలి మరింత పెరుగుతుందన్న హెచ్చరిక అయింది. జాతీయ వాతావరణ సేవ మరో మంచు తుపానుతూర్పు తీరాన్ని తాకే అవకాశం ఉందని హెచ్చరించింది. వచ్చే శుక్ర, శనివారాల్లో పరిస్థితి మరింత కఠినంగా మారొచ్చని తెలిపింది.
ముగ్గురు అన్నదమ్ములు...
టెక్సాస్‌లో మృతి చెందిన 6, 8, 9 ఏళ్ల ముగ్గురు అన్నదమ్ములు మంచు పగిలి చెరువులో పడిపోయారని ఫానిన్ కౌంటీ షెరీఫ్ కోడి షుక్ చెప్పారు. పిల్లలను కాపాడేందుకు తల్లి చెరువులోకి దూకినప్పటికీ మంచు మళ్లీ మళ్లీ పగిలిందని వివరించారు.మిసిసిప్పీ, టెన్నెస్సీ రాష్ట్రాల్లో తాగునీరు, దుప్పట్లు, ఇంధనం, జనరేటర్ల అవసరం ఉందని అధికారులు చెప్పారు. ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ సహాయ సరఫరాలు పంపుతోంది. గ్యాస్ స్టవ్‌లను గదులు వేడి చేయడానికి ఉపయోగించవద్దని ఆరోగ్య శాఖలు హెచ్చరించాయి. లూసియానాలో కార్బన్ మోనాక్సైడ్ విష ప్రభావంతో ఒకరు మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. న్యూయార్క్ నగరంలో చలిలో బయట ఉన్న 10 మంది మృతి చెందారని వెల్లడించారు.
Next Story

