Sat Feb 28 2026 21:00:30 GMT+0530 (India Standard Time)
మధ్యప్రాచ్యంలో విమాన రాకపోకలకు అంతరాయం… ఎయిర్‌లైన్స్ సేవల రద్దు
అమెరికా–ఇజ్రాయెల్ ఇరాన్‌పై చేపట్టిన దాడుల ప్రభావం మధ్యప్రాచ్య దేశాలపై పడింది.

అమెరికా–ఇజ్రాయెల్ ఇరాన్‌పై చేపట్టిన దాడుల ప్రభావం మధ్యప్రాచ్య దేశాలపై పడింది. ప్రాంతీయంగా మాత్రమే కాదు, ఇతర దేశాలకు వెళ్లే విమానాలపైనా అంతరాయం ఏర్పడింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ శనివారం తన గగనతలాన్ని మూసివేసింది. అదే విధంగా ఇజ్రాయిల్ కూడా గగనతలాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. దీని ప్రభావంతో సుదూర ప్రాంతానికి విమాన సేవలు నడిపే ఎమిరేట్స్, ఎతిహాడ్ ఎయిర్ వేస్ సేవలు ప్రభావితమయ్యాయి. ఖతార్ తన ప్రకటనలో దోహా వెళ్లే, దోహా నుంచి బయలుదేరే విమానాలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలిపింది. ఖతార్ గగనతలం కూడా మూసివేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
మరికొన్ని విమానాలను...
ఇజ్రాయెల్‌కు వెళ్తున్న కొన్ని విమానాలను ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు. బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద విమానాల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులను వెనక్కి తరలించారు.ఎమిరేట్స్ తమ ప్రకటనలో యూఏఈ గగనతల మూసివేత కారణంగా కొన్ని విమానాలు ప్రభావితమయ్యాయని పేర్కొంది. ప్రయాణికులు తమ విమాన స్థితిని ఆన్లైన్లో చూసుకోవాలని సూచించింది. ఈ సంస్థ ప్రధాన కేంద్రం దుబాయి అంతర్జాతీయ విమానాశ్రయం . ఇది అంతర్జాతీయ ప్రయాణాలకు అత్యంత రద్దీగా ఉండే కేంద్రంగా గుర్తింపు పొందింది. డచ్ ఎయిర్‌లైన్ కేఎల్ఎం ఆదివారం నుంచి టెల్ అవీవ్‌కు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే విమానాలను నిలిపివేస్తున్నట్లు ఈ వారం ప్రారంభంలోనే ప్రకటించింది.
ఇరాన్ గగనతలం మీదుగా...
బ్రిటన్‌కు చెందిన వర్జిన్ అట్లాంటిక్ లండన్‌లోని హీత్ రో ఎయిర్ పోర్టు నుంచి దుబాయ్‌కు వెళ్లే విమానాన్ని రద్దు చేసింది. ఇకపై ఇరాక్ గగనతలం మీదుగా ఎగరదని తెలిపింది. దీంతో భారత్, మాల్దీవులు, దుబాయ్, రియాద్ వెళ్లే విమానాల ప్రయాణ సమయం కొంత పెరగొచ్చని వెల్లడించింది. ఈ సంస్థ ఇప్పటికే ఇరాన్ గగనతలం మీదుగా విమానాలు నడపడం లేదు. అవసరమైతే తక్షణ మార్పులకు వీలుగా తగిన ఇంధనం ప్రతి విమానంలో ఉంచుతున్నట్లు తెలిపింది. టర్కిస్ ఎయిర్ లైన్స్ సోమవారం వరకు లెబనాన్, సిరియా, ఇరాక్, ఇరాన్, జోర్డాన్ దేశాలకు వెళ్లే విమానాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే శనివారం కతార్, కువైట్, బహ్రెయిన్, యూఏఈ, ఒమాన్ దేశాలకు సేవలు నిలిపివేస్తున్నట్లు తెలిపింది. పరిస్థితిని బట్టి మరిన్ని విమానసంస్థల తమ విమానాలను రద్దు చేసే అవకాశముందని తెలిపింది.
Next Story

