Tue Mar 24 2026 08:44:06 GMT+0530 (India Standard Time)
Iran Israel wara : పశ్చిమాసియా యుద్ధం ముగిసినట్లేనా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ నాయకత్వంతో చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. యుద్ధం ముగించేందుకు ఇరాన్ ఒప్పందానికి ఆసక్తిగా ఉందని పేర్కొన్నారు. హోర్ముజ్ జలసంధిని మళ్లీ తెరవాలని ఇచ్చిన గడువును మరో ఐదు రోజులు పెంచుతున్నట్లు తెలిపారు. లేదంటే ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.నాలుగో వారంలోకి చేరిన ఈ యుద్ధానికి పరిష్కారం దొరకవచ్చన్న సంకేతాలు రావడంతో చమురు ధరలు తగ్గాయి. స్టాక్ మార్కెట్లు కూడా కదిలాయి. వీకెండ్లో అమెరికా–ఇరాన్ పరస్పర హెచ్చరికలతో ఉద్రిక్తత పెరిగిన నేపథ్యంలో ఈ పరిణామం ఉపశమనంగా మారింది.
ఒప్పందానికి సిద్ధంగా ఉందని...
ట్రంప్ మాట్లాడుతూ “ఇరాన్ ఒప్పందానికి సిద్ధంగా ఉంది” అన్నారు. అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ ఆదివారం ఒక ఇరాన్ నేతతో చర్చలు జరిపారని చెప్పారు. అయితే ఆ నేత ఎవరో వెల్లడించలేదు. సుప్రీం లీడర్ అయతొల్లా మొజ్తబా ఖమేనీతో మాత్రం చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. ఇదే విషయంపై ఇరాన్ ఖండించింది. “అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదు” అని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ ఖాలిబాఫ్ తెలిపారు. ఆర్థిక, చమురు మార్కెట్లను ప్రభావితం చేయడానికే తప్పుడు వార్తలు వస్తున్నాయని ఆరోపించారు.
అణు కార్యక్రమం ప్రధాన అంశంగా...
ఒప్పందం కుదిరితే ఇరాన్ సమృద్ధి చేసిన యురేనియంను అమెరికా స్వాధీనం చేసుకుంటుందని ట్రంప్ చెప్పారు. అయితే శాంతియుత అవసరాల కోసం యురేనియం సమృద్ధి చేసుకునే హక్కు తమకు ఉందని ఇరాన్ గతంలోనే స్పష్టం చేసింది. ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త రాబర్ట్ గోల్డ్స్టన్ ప్రకారం, ఇరాన్ ఇప్పటికే అణ్వాయుధ స్థాయి యురేనియం తయారీకి అవసరమైన సెంట్రిఫ్యూజ్ పనిలో 99% పూర్తి చేసింది. 2025 జూన్ నాటికి 440.9 కిలోల అధిక స్థాయి యురేనియం ఉందని అణుశక్తి సంస్థ అంచనా వేసింది.
మధ్యవర్తిత్వానికి టర్కీ, ఈజిప్ట్...
టర్కీ, ఈజిప్ట్ దేశాలు ఇరుపక్షాలతో మాట్లాడినట్లు వెల్లడించాయి. ప్రాంతీయ స్థాయిలో సమన్వయ ప్రయత్నాలకు ఇది తొలి సంకేతంగా భావిస్తున్నారు. ఈ యుద్ధంలో ఇప్పటికే 2,000 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడింది. చమురు ధరలు పెరిగాయి. విమాన రాకపోకలపై కూడా ముప్పు ఏర్పడింది.
హోర్ముజ్ జలసంధిపై ఉద్రిక్తత...
ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన హోర్ముజ్ జలసంధిని 48 గంటల్లో తెరవకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఆ గడువు సోమవారం ముగియాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఐదు రోజులు పొడిగించారు. ఈ గడువు కొనసాగుతున్న చర్చలపై ఆధారపడి ఉంటుందని ట్రంప్ తెలిపారు. “ఇరాన్ శాంతి కోరుతోంది. అణ్వాయుధాలు తయారు చేయబోమని చెప్పింది. ఈ వారం ఒప్పందం కుదిరే అవకాశం ఉంది” అన్నారు.
మధ్యవర్తిత్వ చర్చలు...
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి, టర్కీ విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్‌తో ఫోన్లో మాట్లాడారు. టర్కీ గతంలో కూడా మధ్యవర్తిగా వ్యవహరించింది.ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్-సీసీ కూడా ఉద్రిక్తత తగ్గించే దిశగా ఇరాన్‌కు స్పష్టమైన సందేశాలు పంపినట్లు తెలిపారు. అమెరికా–ఇరాన్ మధ్య సందేశాలు ఈజిప్ట్, టర్కీ, పాకిస్తాన్ ద్వారా వెళ్లినట్లు సమాచారం.
ఇరాన్ ప్రతిస్పందన ఇదే...
ట్రంప్ వెనక్కి తగ్గారని ఇరాన్ మీడియా పేర్కొంది. అవసరమైన స్థాయి రక్షణ సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపింది.విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తే అమెరికా స్థావరాలకు విద్యుత్ సరఫరా చేసే కేంద్రాలపై ప్రతిదాడి చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. గల్ఫ్ దేశాల్లో తాగునీటి ప్లాంట్లు కూడా లక్ష్యాలుగా మారవచ్చని పేర్కొంది.
కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు...
ఇజ్రాయెల్ సోమవారం టెహ్రాన్‌పై మళ్లీ దాడులు చేసింది. లెబనాన్‌లో హెజ్బొల్లా లక్ష్యంగా కూడా దాడులు కొనసాగుతున్నాయి. వంతెనలు, భవనాలు ధ్వంసమయ్యాయి.లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ ఈ దాడులు భూసైన్య దాడికి ముందు సంకేతమని అన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మాత్రం దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు.లెబనాన్‌లో 1,000 మందికిపైగా, ఇరాన్లో 1,500 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్‌లో 15 మంది మరణించారు. అమెరికా సైనికులు 13 మంది మృతి చెందారు.
Next Story

