Sun Apr 12 2026 14:08:19 GMT+0530 (India Standard Time)
America - Iran - Talks : 21 గంటల నిష్ప్రయోజనమే.. మళ్లీ జరుగుతాయా?
అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన చర్చలు ఒప్పందం లేకుండానే ముగిశాయి

అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన చర్చలు ఒప్పందం లేకుండానే ముగిశాయి. అణు ఆయుధాల అభివృద్ధి చేయబోమని స్పష్టమైన హామీ ఇవ్వడానికి టెహ్రాన్ సిద్ధం కాలేదని అమెరికా వెల్లడించింది. దీంతో రెండు వారాల కాల్పుల విరమణ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది.అమెరికా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ, పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో 21 గంటల పాటు చర్చలు సాగాయని తెలిపారు. “అణు ఆయుధాలు అభివృద్ధి చేయబోమన్న స్పష్టమైన హామీ ఇరాన్ ఇవ్వలేదు” అని చెప్పారు.ఈ 14 రోజుల కాల్పుల విరమణ తర్వాత పరిస్థితి ఏ దిశలో వెళ్తుందో ఆయన వ్యాఖ్యల్లో స్పష్టత రాలేదు. అయితే పాకిస్తాన్ మధ్యవర్తులు కాల్పుల విరమణ కొనసాగించాలని అమెరికా, ఇరాన్‌ను కోరారు.
కాల్పుల విరమణకు...
“ఇరు పక్షాలు కాల్పుల విరమణకు కట్టుబడి ఉండాలి. త్వరలో కొత్త చర్చలకు వేదిక కల్పించేందుకు మా దేశం ప్రయత్నిస్తుంది” అని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ చెప్పారు. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ స్పందిస్తూ, “రెండు మూడు ముఖ్య అంశాలపై అభిప్రాయ భేదాల వల్లే చర్చలు విఫలమయ్యాయి” అన్నారు. చర్చల్లో హోర్ముజ్ జలసంధి అంశం ప్రస్తావనకు వచ్చిందని చెప్పారు. “అమెరికా అతిగా జోక్యం చేసుకోవడం సమస్యకు కారణం” అని విమర్శించారు. అణు ఆయుధాల అంశాన్ని మాత్రం ప్రస్తావించలేదు.శనివారం ఈ చర్చలు ప్రారంభమయ్యాయి. వేల మందిని బలి తీసుకున్న యుద్ధం ఏడో వారంలోకి ప్రవేశించిన సమయంలోనే కాల్పుల విరమణ ప్రకటించారు.
అణ్వాస్త్రాల విషయంలో...
“అణు ఆయుధాలు అభివృద్ధి చేయబోమన్న హామీ మాత్రమే కాదు, ఆ దిశగా దారితీసే సామర్థ్యాన్ని కూడ ఇరాన్ వదులుకోవాలి. ఇదే అమెరికా అధ్యక్షుడి లక్ష్యం” అని వాన్స్ మీడియాతో చెప్పారు. “మా తుది ప్రతిపాదనను ఇరాన్ అంగీకరిస్తుందో లేదో చూడాలి” అని అన్నారు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి ఇరాన్లో 3,000 మంది, లెబనాన్‌లో 2,020 మంది, ఇజ్రాయెల్‌లో 23 మంది, గల్ఫ్ అరబ్ దేశాల్లో పది మందికి పైగా మరణించారు. మధ్యప్రాచ్యంలోని అనేక దేశాల్లో మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లింది. హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణతో పర్షియన్ గల్ఫ్ నుంచి చమురు, వాయువు ఎగుమతులు ప్రపంచానికి దాదాపు ఆగిపోయాయి. దీంతో ఇంధన ధరలు పెరిగాయి.
హోర్ముజ్ జలసంధిలో...
చర్చల సమయంలో అమెరికా సైన్యం రెండు విధ్వంసక నౌకలు హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించాయని ప్రకటించింది. మైన్ల తొలగింపు చర్యలకు ముందస్తుగా ఇవి కదిలాయని తెలిపింది. అయితే ఇరాన్ సంయుక్త సైనిక కమాండ్ ఈ సమాచారాన్ని ఖండించినట్లు అక్కడి ప్రభుత్వ మీడియా వెల్లడించింది. “ఒప్పందం జరిగిందా లేదన్నది పక్కన పెడితే, మేము జలసంధిని శుభ్రం చేస్తున్నాం” అని ట్రంప్ ఆదివారం తెల్లవారుజామున చెప్పారు.అమెరికా ప్రతినిధి వాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాగర్ ఖలీబాఫ్ నేతృత్వంలోని బృందాలు పాకిస్తాన్ మధ్యవర్తులతో కాల్పుల విరమణ కొనసాగింపుపై చర్చించాయి. లెబనాన్‌లో ఇరాన్ మద్దతుతో ఉన్న హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండటంతో పరిస్థితి క్లిష్టంగా ఉంది.
ఇజ్రాయిల్ డిమాండ్...
నవంబర్ 2024లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం హిజ్బుల్లాను నిరాయుధీకరించే బాధ్యత లెబనాన్ ప్రభుత్వంపై ఉండాలని ఇజ్రాయెల్ కోరుతోంది. అయితే ఈ దళాన్ని అణచివేయడం దశాబ్దాలుగా సవాలుగానే ఉంది.యుద్ధం ప్రారంభ దశలోనే ఇరాన్‌కు మద్దతుగా హిజ్బుల్లా రంగంలోకి దిగింది. దానికి ప్రతిగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు, భూసేన చర్యలు చేపట్టింది.ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన రోజే ఇజ్రాయెల్ బీరుట్‌పై భారీ వైమానిక దాడులు చేసింది. ఆ రోజే 300 మందికిపైగా మరణించినట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
Next Story

