Sat Dec 13 2025 22:32:56 GMT+0000 (Coordinated Universal Time)
America : అమెరికా షట్ డౌన్ తో ఎన్ని కష్టాలు.. భారమంతా వాటిపైనే?
అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ తో ఆర్థిక వ్యవస్థపై పెను భారం పడనుంది.

అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ తో ఆర్థిక వ్యవస్థపై పెను భారం పడనుంది. ఇప్పటికే అనేక విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. పర్యాటక రంగం కూడా దెబ్బతినింది. అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ కారణంగా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఎయిర్ ట్రాన్స్ పోర్టు తగ్గించాలన్న ఆదేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో శనివారానికి 2,500కుపైగా విమానాలను రద్దు చేశారు. దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో ఆలస్యంగా నడుస్తున్నాయి. అనేక విమాన సర్వీసులు రద్దయ్యాయి. అయితే ఇది ప్రభుత్వ షట్‌డౌన్ ప్రభావాన్ని మరింతగా పెంచిందని అధికారులు తెలిపారు. ప్రయాణికులు అత్యవసర ప్రయాణం చేయాలంటే వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి.
ఎయిర్ పోర్టుల్లోనే గంటల తరబడి...
ఎయిర్ పోర్టుల్లోనే గంటల తరబడి వేచి చూడాల్సి ఉంటుంది. అయినా ప్రయాణం జరుగుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. అమెరికాలో గత 38 రోజులకు పైగానే షట్ డౌన్ కొనసాగుతుంది. ఇది ఒక రకంగా రికార్డు. గతంలో ఎప్పుడూ ఇన్ని రోజులు షట్ డౌన్ కొనసాగేలేదన్న విషయాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. షట్ డౌన్ తో టూరిజం, షిప్పింగ్, తయారీ రంగాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. థ్యాంక్స్‌గివింగ్ వారానికి చేరుకునే సమయానికి పరిస్థితి మరింత తీవ్రమవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఫ్లైట్అవేర్ వెబ్సైట్ ప్రకారం శనివారం మధ్యాహ్నం నాటికి నార్త్ కరోలినాలోని చార్లెట్ విమానాశ్రయంలో 130 విమానాలు రద్దు అయ్యాయి. అట్లాంటా, చికాగో, డెన్వర్, న్యూఆర్క్ విమానాశ్రయాల్లో కూడా అనేక విమానాలు రద్దయ్యాయి.
ప్రయాణికుల అవస్థలు...
ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అందించిన సమాచారం ప్రకారం నలభై విమానాశ్రయాల్లో వాణిజ్య విమానాల సంఖ్యను నాలుగు శాతం తగ్గించగా, మంగళవారం అది పెరగనుంది. శుక్రవారం నాటికి 10 శాతం సర్వీసులను నిలిపివేయనున్నట్లు తెలిపింది. సిబ్బంది కొరతతో కంట్రోల్ టవర్లలో ఒత్తిడి పెరిగింది. దాదాపు నెల రోజులుగా వేతనం అందకపోవడంతో అనేక మంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు కూడా సిక్ లీవ్ లు తీసుకుంటున్నారు. కొన్ని విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తక్షణమే రీబుకింగ్ చేసుకున్నారు. అమెరికా విమాన రవాణాలో సగం సరుకు రవాణా వాణిజ్య విమానాల ద్వారానే జరుగుతుంది. ఇప్పడు దానిపైన కూడా ప్రభావం పడుతుంది. దీంతో ఆర్థిక వ్యవస్థపై పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది.
Next Story

