Sat Jan 10 2026 20:56:45 GMT+0000 (Coordinated Universal Time)
Venezuela: వెనిజువెలా చమురు రంగం అమెరికా చేతుల్లోకి
వెనిజువెలా చమురు రంగంలోకి వెంటనే తిరిగి ప్రవేశించాలంటూ అమెరికా చమురు దిగ్గజ కంపెనీలకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు.

వెనిజువెలా చమురు రంగంలోకి వెంటనే తిరిగి ప్రవేశించాలంటూ అమెరికా చమురు దిగ్గజ కంపెనీలకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. వెనిజువెలాలో నిర్లక్ష్యానికి గురైన మౌలిక వసతులను సరిచేసి, అక్కడి విస్తారమైన చమురు నిల్వలను పూర్తిగా వినియోగించుకోవాలన్నదే లక్ష్యమని ఆయన చెప్పారు. ఇందుకు కోసం 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సమీకరించేందుకు వైట్ హౌస్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇటీవల అమెరికా సైనిక దాడిలో వెనిజువెలా మాజీ అధ్యక్షుడు నికోలాస్ మడూరోను అదుపులోకి తీసుకున్న తర్వాత, ట్రంప్ ఈ చర్యను అమెరికాకు ఆర్థిక అవకాశంగా చూపుతున్నారు. వెనిజులా చమురు తరలిస్తున్న ట్యాంకర్లను అమెరికా స్వాధీనం చేసుకుంది.
చమురు అమ్మకాలను...
గతంలో ఆంక్షలు ఎదుర్కొన్న 3 కోట్ల నుంచి 5 కోట్ల బ్యారెళ్ల వెనిజువెలా ముడి చమురు అమ్మకాలను అమెరికానే చేపడుతుందని ట్రంప్ చెప్పారు. ఈ అమ్మకాలను ప్రపంచవ్యాప్తంగా నిరవధికంగా నియంత్రించే యోచన ఉందన్నారు. వైట్ హౌస్‌లో జరిగిన సమావేశంలో ప్రధాన చమురు కంపెనీల ప్రతినిధులు ఆసక్తి వ్యక్తం చేసినప్పటికీ, గత అనుభవాల దృష్ట్యా జాగ్రత్త అవసరమని తెలిపారు. “ప్రస్తుతం వెనిజువెలాలో ఉన్న వాణిజ్య వ్యవస్థలు, చట్టపరమైన చట్రాలు పెట్టుబడులకు అనుకూలంగా లేవు,” అని అమెరికాలో అతిపెద్ద చమురు సంస్థ ఎక్సాన్‌మొబిల్ సీఈవో డారెన్ వుడ్స్ చెప్పారు. సమావేశంలో ట్రంప్ స్వయంగా జోక్యం చేసుకుని కంపెనీలకు భద్రతపై హామీ ఇచ్చారు. “మీకు పూర్తి భద్రత ఉంటుంది. మీరు వెనిజువెలాతో కాదు… నేరుగా మా ప్రభుత్వంతోనే వ్యవహరిస్తారు,” అని చెప్పారు. భద్రతా హామీ వెనిజువెలా నాయకులు, ప్రజలతో కలిసి పని చేయడం ద్వారా వస్తుందని, అమెరికా సైన్యాన్ని అక్కడ మోహరించే ఆలోచన లేదని ట్రంప్ తెలిపారు.
చైనా.. రష్యా...ఆక్రమించేవని...
అవసరమైతే కంపెనీలే కొంత భద్రత ఏర్పాటు చేస్తాయని కూడా అన్నారు. ఎక్సాన్‌మొబిల్ గతంలో వెనిజులాలో తన ఆస్తులు రెండుసార్లు స్వాధీనం చేసుకున్న విషయాన్ని గుర్తు చేసింది. పరిస్థితిని అధ్యయనం చేసేందుకు బృందాన్ని పంపుతామని వుడ్స్ చెప్పారు. మడూరోను తొలగించి వెనిజులా చమురు రంగంపై అమెరికా పర్యవేక్షణ అవసరమని ట్రంప్ మరో కారణం చెప్పారు. తాము ఇది చేయకపోతే చైనా లేదా రష్యా చేసేవని అన్నారు. మరొకవైపు అమెరికా–వెనిజువెలా దేశాలు దౌత్య సంబంధాల పునరుద్ధరణ అవకాశాలపై చర్చలు జరుపుతున్నట్లు వెల్లడైంది. కరాకాస్‌లో అమెరికా దౌత్య కార్యాలయం పునఃప్రారంభంపై అధ్యయనానికి అమెరికా బృందం అక్కడికి వెళ్లినట్లు స్టేట్ డిపార్ట్మెంట్ తెలిపింది.ట్రంప్ వచ్చే వారం వెనిజులా ప్రతిపక్ష నేత మరియా కొరీనా మాచాడోను కలవనున్నట్లు ప్రకటించారు. అలాగే కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోతో వచ్చే నెల సమావేశం ఉంటుందని తెలిపారు.
Next Story

