Sat Jan 24 2026 04:34:04 GMT+0000 (Coordinated Universal Time)
Donald Trump : కెనడాపై ట్రంప్ ఫైర్... తమ వల్లే బతుకుతుందంటూ?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గ్రీన్‌ల్యాండ్‌పై ప్రతిపాదించిన ‘గోల్డెన్ డోమ్’ క్షిపణి రక్షణ ప్రాజెక్టును కెనడా తిరస్కరించిందని మండిపడ్డారు. ఆ ప్రాజెక్టు కెనడాకు కూడా రక్షణ కల్పిస్తుందని పేర్కొన్నారు. చైనాతో దగ్గరపడితే ఏడాదిలోపే “మింగేస్తుంది” అంటూ హెచ్చరించారు. ట్రూత్ సోషల్‌లో చేసిన పోస్టులో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. గ్రీన్‌ల్యాండ్‌పై గోల్డెన్ డోమ్ నిర్మాణానికి కెనడా వ్యతిరేకంగా ఉందని, ఆ వ్యవస్థ కెనడాకూ రక్షణ ఇస్తుందని, దానికి బదులుగా చైనాతో వ్యాపారం చేయడానికి వారు ఓటేశారని, చైనా ఏడాదిలోపే వాళ్లను మింగేస్తుందని ట్రంప్ పేర్కొన్నారు.
వాషింగ్టన్–ఒట్టావా మధ్య...
వాషింగ్టన్–ఒట్టావా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ వారమే డావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో కెనడా ప్రధాని మార్క్ కార్నీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ట్రంప్ స్పందించారు. 56వ డబ్ల్యుఈఎఫ్ సదస్సులో ప్రసంగించిన ట్రంప్, అమెరికా ఇచ్చే భద్రతా, ఆర్థిక లాభాలకు కెనడా మరింత కృతజ్ఞత చూపాలని అన్నారు. త నుంచి కెనడాకు చాలా ఉచిత లాభాలు వస్తున్నాయి. కృతజ్ఞత చూపాలని, కానీ చూపడం లేదని వ్యాఖ్యానించారు. గోల్డెన్ డోమ్ వ్యవస్థ కెనడాను కూడా రక్షిస్తుందని తెలిపారు.
ట్రంప్ వ్యాఖ్యలతో...
అమెరికా వల్లే కెనడా బతుకుతోందని, తదుపరి వ్యాఖ్యలు చేసే ముందు ఇది గుర్తుంచుకో, మార్క్ అంటూ ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కెనడా భద్రతలో అమెరికా పాత్రను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.డబ్ల్యుఈఎఫ్లో కార్నీ ప్రసంగంలో ప్రపంచ శక్తుల మధ్య పోటీ యుగం గురించి మాట్లాడారు. టారిఫ్‌ల ద్వారా ఒత్తిడి పెడుతున్న విధానాలను విమర్శించారు. ఇవి వాషింగ్టన్ వైపు ఉద్దేశించిన వ్యాఖ్యలుగా భావించారు. ఈ నెల 17న చైనాతో కొత్త వాణిజ్య ఒప్పందాన్ని కార్నీ ప్రకటించారు. ఈ ఒప్పందంతో కెనడియన్ కార్మికులు, వ్యాపారాలకు కొత్త మార్కెట్లు తెరుచుకుంటాయని చెప్పారు. ఎక్స్‌లో చేసిన పోస్టులో 7 బిలియన్ డాలర్లకు పైగా ఎగుమతి మార్కెట్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా నుంచి పెద్ద అవకాశాలు ఉన్నాయని కెనడా ప్రధాని కార్యాలయం వెల్లడించింది.
సుంకాలతో...
ఈ ఒప్పందం ప్రకారం చైనా ఎలక్ట్రిక్ వాహనాలపై కెనడా విధిస్తున్న 100 శాతం సుంకాన్ని తగ్గించేందుకు అంగీకరించింది. దానికి బదులుగా కెనడా వ్యవసాయ ఎగుమతులపై చైనా సుంకాలు తగ్గించనుంది. ముఖ్యంగా కానోలా గింజలపై సుంకం 84 శాతం నుంచి దాదాపు 15 శాతానికి తగ్గనుంది. తొలి దశలో ఏడాదికి 49 వేల చైనా ఈవీలు కెనడాకు ఎగుమతి అవుతాయని, ఐదేళ్లలో ఈ సంఖ్య 70 వేలకు పెరుగుతుందని కార్నీ చెప్పారు. అమెరికాతో పోలిస్తే చైనా ఇప్పుడు మరింత అంచనా వేసే భాగస్వామిగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అమెరికా కెనడా ఉత్పత్తులపై 35 శాతం సుంకం విధిస్తోంది. దిగుమతి లోహాలపై 50 శాతం, అమెరికా కాకుండా తయారైన కార్లపై 25 శాతం సుంకం అమల్లో ఉంది. మరోవైపు అమెరికా–చైనా మధ్య పరస్పరంగా 100 శాతం సుంకాల బెదిరింపులు చోటుచేసుకున్నాయి. అయితే ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భేటీ తర్వాత కొన్ని చైనా ఉత్పత్తులకు 2026 నవంబర్ 10 వరకు మినహాయింపులు ఇచ్చారు.
Next Story

