Tue Jan 06 2026 03:22:45 GMT+0000 (Coordinated Universal Time)
Trump : రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ముగింపు విషయంలో ట్రంప్ ఇబ్బంది పడుతున్నారా?
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రభుత్వ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి జరిపిందన్న ఆరోపణల్లో వాస్తవం లేదు

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రభుత్వ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి జరిపిందన్న ఆరోపణల్లో వాస్తవం లేదు. ఇది అమెరికా జాతీయ భద్రతా అధికారులు తేల్చారని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఉక్రెయిన్ డ్రోన్లు వాయవ్య నోవ్‌గొరోడ్ ప్రాంతంలోని పుతిన్ రాష్ట్ర నివాసంపై దాడి చేశాయని, రష్యా రక్షణ వ్యవస్థలు వాటిని అడ్డుకున్నాయని విదేశాంగ మంత్రి గత వారం ప్రకటించిన నేపథ్యంలో ట్రంప్ ఈ రకమైన ప్రకటన చేశారు. యుద్ధం ముగింపు చర్చలు ఊపందుకుంటున్న సమయంలోనే కీవ్ దాడికి దిగిందంటూ ఆయన విమర్శించారు. శాంతి చర్చలను దెబ్బతీయాలనే మాస్కో ప్రయత్నమని యూరప్ అభిప్రాయం వ్యక్తం చేస్తుంది.
ట్రంప్ తో భేటీ తర్వాత...
ఈ ఆరోపణలు వెలువడిన మరుసటి రోజే ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ ఫ్లోరిడాలో ట్రంప్‌తో భేటీ అయ్యారు. యుద్ధం ముగింపునకు ఉద్దేశించిన ఇరవై అంశాల ప్రణాళికపై చర్చించారు. అయితే డ్రోన్ దాడి అంశాన్ని జెలెన్స్కీ వెంటనే ఖండించారు. అలాంటి దాడి జరిగినట్టు తనకు నమ్మకం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. గత సోమవారం పుతిన్‌తో ఫోన్లో మాట్లాడిన సందర్భంగా ఈ అంశం తన ముందుకు వచ్చిందని, అప్పట్లో ఆరోపణలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశానని చెప్పారు. యూరప్ దేశాల అధికారులు మాత్రం శాంతి ప్రయత్నాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే రష్యా ఈ కథనాన్ని తెరపైకి తెచ్చిందని వ్యాఖ్యానించారు. అయితే ప్రారంభంలో ట్రంప్ ఈ ఆరోపణలను నమ్మినట్టే కనిపించారు.
యుద్ధాన్ని ముగించాలన్న...
బుధవారం నాటికి ట్రంప్ వైఖరిలో మార్పు కనిపించింది. రష్యా వాదనలపై సందేహం వ్యక్తం చేసిన న్యూయార్క్ పోస్ట్ సంపాదకీయాన్ని తన సోషల్ మీడియా వేదికపై పంచుకున్నారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని త్వరగా ముగిస్తానన్న హామీని నెరవేర్చడంలో ట్రంప్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జెలెన్స్కీ, పుతిన్ ఇద్దరిపైనా అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. మార్-ఎ-లాగోలో జరిగిన చర్చల్లో పురోగతి సాధించినట్టు ట్రంప్, జెలెన్స్కీ తెలిపారు. అయితే డోన్బాస్ ప్రాంతం పూర్తిగా తమ నియంత్రణలోకి రావాల్సిందేనని, యుద్ధానంతర ఉక్రెయిన్ సైన్యంపై కఠిన పరిమితులు విధించాలని పుతిన్ పట్టుబడుతున్నట్టు అమెరికా వర్గాలు చెబుతున్నాయి. రష్యా ఆరోపణలను అమెరికా భద్రతా సంస్థలు ఖండించడం విశేషం.
Next Story

