Fri Jan 09 2026 19:11:30 GMT+0000 (Coordinated Universal Time)
Donald Trump : భారత్ పై చల్లారని ట్రంప్ ఆగ్రహం.. 500 శాతం టారిఫ్ పెంచేందుకు
రష్యాపై కొత్త ఆంక్షల బిల్లుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపారు

రష్యాపై కొత్త ఆంక్షల బిల్లుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపారు. ఈ బిల్లు అమలులోకి వస్తే, రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలపై 500 శాతం వరకూ టారిఫ్‌లు విధించే అవకాశం ఉంటుంది. చైనా, భారత్, బ్రెజిల్ వంటి దేశాలపై ఒత్తిడి తెచ్చి, ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న యుద్ధానికి నిధులు అందకుండా చేయడమే లక్ష్యంగా ఈ బిల్లును రూపొందించారు.సెనేటర్ లిండ్సే గ్రాహమ్ మాట్లాడుతూ, బుధవారం వైట్ హౌస్‌లో అధ్యక్షుడు ట్రంప్‌తో జరిగిన సమావేశం చాలా సానుకూలంగా సాగిందన్నారు. నెలలుగా రూపుదిద్దుకుంటున్న రష్యా ఆంక్షల బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పారు. అంతా ఒకే అయితే దీనిపై వచ్చే వారమే ఓటింగ్ జరిగే అవకాశముంది.
రష్యా నుంచి...
ఉక్రెయిన్ శాంతి కోసం కొన్ని రాయితీలు ఇస్తోందని, కానీ పుతిన్ మాటలకే పరిమితమై నిరపరాధులను చంపుతూనే ఉన్నారని, రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలను శిక్షించేందుకు ఈ బిల్లు అధ్యక్షుడికి పూర్తి అధికారాలు ఇస్తుందని గ్రాహమ్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ బిల్లు అమలైతే చైనా, భారత్, బ్రెజిల్ వంటి దేశాలపై భారీ ఒత్తిడి పెరుగుతుందని గ్రాహమ్ స్పష్టం చేశారు. రష్యా తక్కువ ధర చమురు కొనుగోళ్లతో పుతిన్ యుద్ధ యంత్రానికి నిధులు అందుతున్నాయన్నది ఆయన వాదన. వచ్చే వారం నుంచే ఈ బిల్లుపై సెనెట్‌లో బలమైన ద్విపక్ష మద్దతుతో ఓటింగ్ జరిగే అవకాశం ఉందని చెప్పారు.రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్‌పై అమెరికా ఇప్పటికే 25 శాతం టారిఫ్ విధించింది. మొత్తం మీద భారత్‌పై విధించిన టారిఫ్‌లు 50 శాతం వరకు చేరాయని గ్రాహమ్ తెలిపారు.
తక్కువ ధరలకు...
గ్రాహమ్, బ్లూమెన్థాల్ కలిసి ప్రవేశపెట్టిన ‘శాంక్షనింగ్ రష్యా యాక్ట్–2025’ బిల్లులో, రష్యా చమురు ద్వితీయ కొనుగోలు, పునర్విక్రయాలపై 500 శాతం టారిఫ్ ప్రతిపాదన ఉంది. ఈ బిల్లుకు సెనేట్ విదేశాంగ కమిటీ సభ్యులలో ఎక్కువ మంది సహప్రయోజకులుగా ఉన్నారు. ఇటీవల భారత రాయబారి వినయ్ క్వాత్రా, రష్యా చమురు కొనుగోళ్లు తగ్గిస్తున్నామని గ్రాహమ్‌కు తెలియజేశారు. భారత్‌పై విధించిన టారిఫ్‌లు తగ్గించాలని ట్రంప్‌కు చెప్పాలని కోరినట్టు గ్రాహమ్ వెల్లడించారు. భారత్ తన ముడి చమురు అవసరాల్లో దాదాపు 88 శాతం విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. 2021 వరకు భారత్ దిగుమతుల్లో రష్యా చమురు వాటా కేవలం 0.2 శాతం మాత్రమే. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత పశ్చిమ దేశాలు రష్యాను దూరం పెట్టడంతో, తక్కువ ధరల రష్యా చమురును భారత్ పెద్ద ఎత్తున కొనుగోలు చేసింది. ఈ ప్రభావంతో స్టాక్ మార్కెట్ లు కుప్పకూలాయి.
Next Story

