Mon Oct 07 2024 14:16:43 GMT+0000 (Coordinated Universal Time)
హైతీలో పేలిన గ్యాస్ ట్యాంకర్.. 62 మంది దుర్మరణం
హైతీలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు గ్యాస్ ట్యాంకర్ పేలడంతో.. 62 మంది దుర్మరణం చెందారు
హైతీలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు గ్యాస్ ట్యాంకర్ పేలడంతో.. 62 మంది దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్తే.. హైతియన్ సిటీలోని కాప్ హైతియన్ లో ఈ ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. స్థానికులు చెప్పిన వివరాల మేరకు గ్యాస్ ట్యాంకర్ ఒక బైక్ ను తప్పించబోయి బోల్తా పడినట్లు తెలుస్తోంది. గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో అందులోని గ్యాస్ ను సేకరించేందుకు అక్కడి ప్రజలు పరుగులు తీశారు. ఇంతలో ఆ గ్యాస్ ట్యాంకర్ పెద్ద శబ్దంతో పేలింది. పేలుడు సంభవించిన సమయంలో సుమారు 50 నుంచి 54 మంది సజీవదహనమవ్వగా.. తీవ్ర గాయాలతో మరికొంతమంది మృతి చెందారు.
మృతుల సంఖ్య.....
ఘటనా స్థలానికి చేరుకున్నసిబ్బంది, అధికారులు సహాయకచర్యలు చేపట్టారు. కాగా.. మృతి చెందిన వారిని గుర్తించడం చాలా కష్టంగా ఉందని అధికారులు తెలిపారు. గ్యాస్ ట్యాంకర్ పేలుడుతో ఆ ప్రాంతంలోని 40 ఇళ్లు కాలిపోయినట్లు డిప్యూటీ మేయర్ అల్మోనోర్ పేర్కొన్నారు. అయితే ఆ ఇళ్లలో ఎంతమంది బాధితులు ఉన్నారన్న వివరాలు అప్పుడే చెప్పలేమన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను సమీపంలోని జస్టినియన్ యూనివర్శిటీ ఆసుపత్రికి తరలించగా.. ఆ ఆస్పత్రి మొత్తం వారితో కిక్కిరిసి పోయింది. తీవ్రంగా కాలిన గాయాలతో ఉన్న వారి సంఖ్య పెరుగుతుండటంతో చికిత్స చేయడం కష్టంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు, వైద్యులు చెప్తున్నారు.
Next Story