మిస్ ఇంగ్లండ్ వ్యాఖ్యల్లో అసలు నిజమిదేనట

మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ చేసిన వ్యాఖ్యల్లో ఏ మాత్రం నిజం లేదని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సీఈవో జూలియా మోర్లే, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ఖండించారు. తప్పుడు ప్రవర్తన ఎక్కడా జరగలేదని, మిల్లా మాగీ వ్యాఖ్యలు నిరాధారమైనవని జయేశ్ రంజన్ అన్నారు. తన తల్లి ఆరోగ్యం బాగోలేదని, స్పోర్ట్స్ ఛాలెంజ్ ఫైనల్ జరిగిన మరుసటి రోజు ఇంగ్లాండ్ వెళ్లిపోయారన్నారు. అంతకుముందు మిల్లా మాగీ ఒకే ఒక డిన్నర్‌కు హాజరయ్యారని, అది కూడా చౌమహల్లా ప్యాలెస్‌లో ప్రభుత్వం ఇచ్చిన విందులో పాల్గొన్నారని తెలిపారు. ఆమెను తప్పుగా చూడటం, ప్రవర్తించడం వంటి పరిస్థితే లేదన్నారు.
అందుకే వైదొలగాలని...
మిల్లా మాగీ తన తల్లి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా పోటీ నుంచి వైదొలగాలని అనుకుంటున్నట్లు కోరిందని, కుటుంబ శ్రేయస్సు మొదటి ప్రాధాన్యంగా భావించి ఇంగ్లాండ్ తిరిగి వెళ్లడానికి ఏర్పాట్లు చేశామని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఛైర్పర్సన్, సీఈవో జూలియా మోర్లే తెలిపారు. ఆమె స్థానంలో మిస్ ఇంగ్లాండ్ మొదటి రన్నరప్ షార్లెట్ గ్రాంట్ భారత్ కు వచ్చారని వివరించారు.

