Fri Dec 05 2025 14:13:08 GMT+0000 (Coordinated Universal Time)
Pakistan : కాల్పుల విరమణ బ్రేక్ చేయడానికి కారణాలివేనా?
భారత్ - పాక్ కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన గంటల్లోనే పాక్ కాల్పులకు దిగడం వెనక అనేక అనుమానాలున్నాయి.

భారత్ - పాక్ కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన గంటల్లోనే పాక్ కాల్పులకు దిగడం వెనక అనేక అనుమానాలున్నాయి. పాక్ ప్రభుత్వం మాటలు సైన్యం వినడం లేదా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. పాక్ ఆర్మీ తమ పరువును నిలుపుకునేందుకు ప్రభుత్వం మాటను బేఖాతరు చేసి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచిందని అంటున్నారు. పాకిస్తాన్ లోని ప్రభుత్వంపై ఆర్మీది ఎప్పుడూ పై చేయిగానే ఉంటుంది. సైనిక తిరుగుబాట్లు సర్వసాధారణమే అయినప్పటికీ అక్కడ కాల్పుల విమరణ ఒప్పందానికి కట్టుబడి లేదన్న చర్చ జరుగుతుంది. ప్రభుత్వం అన్ని రకాలుగా ఆలోచించి కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకున్న తీరును పాక్ సైన్యం తప్పుపడుతుందా? అన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం ఒప్పించగలిగినా...?
ఆపరేషన్ సిందూర్ తో దాయాది దేశం పాక్ ఉక్కిరి బిక్కిరి అయింది. తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు, ఎయిర్ బేస్ లను నాశనం చేసిన నాటి నుంచి పగతో అది రగిలిపోతుంది. చివరకు అంతర్జాతీయ ద్రవ్యనిధి కూడా ఆర్థిక సాయాన్ని కాల్పుల విరమణ పాటిస్తేనే చేస్తామని చెప్పడంతో ఇక పాక్ కు దిక్కుతోచక కాల్పుల విరమణ ఒప్పందానికి ముందుకు వచ్చింది. అగ్రరాజ్యం అమెరికా కాళ్లా వేళ్లాపడి బతిమాలుకుని కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పించగలిగింది. కానీ ప్రభుత్వం దేశ పరిస్థితిని అనేక కోణాల్లో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో పాటు ఇంధన నిల్వలు కూడా తగ్గడంతో దిగిరాక తప్పని సరి పరిస్థితి పాక్ ది.
మాట పెడచెవిన పెట్టిందని...
అయితే పాక్ సైన్యం మాత్రం కాల్పుల విరమణ ఒప్పందాన్ని బ్రేక్ చేయడంతో ప్రభుత్వం మాట పెడచెవిన పెట్టిందన్నది అర్థమవుతుంది. రేపు ఇరు దేశాలసైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ ల మధ్య చర్చలు జరగాల్సిన సమయంలో మళ్లీ కాల్పులకు తెగబడుతుండటంతో పాలనా పగ్గాలు పాక్ సైన్యం చేతిలోకి వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు. గంటల్లోనే ఉల్లంఘించి కాల్పులకు తెగబడటం అంటే ఖచ్చితంగా ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేయడమేనని అంటున్నారు. సైనికులే తమ దేశాన్ని నడిపించేందుకు సిద్ధమయినట్లు కనిపిస్తుందని కొందరు అంటున్నారు. సైన్యం చెప్పుచేతల్లోకి పాక్ పాలన వెళ్లిపోయే సంకేతాలు కనిపిస్తున్నాయన్న వార్తలు కూడా వస్తున్నాయి. మొత్తం మీద పాక్ ప్రభుత్వానికి, సైన్యానికి మధ్య నెలకొన్న గ్యాప్ మరోసారి భారత్ - పాక్ ల మధ్య ఉద్రిక్తతలు నెలకొనే అవకాశముందని తెలిసింది.
సైన్యానిదే పెత్తనం...
పాక్ లో పేరుకే ప్రజాస్వామ్యం. పెత్తనమంతా సైన్యానిదే. ఏ దేశాధినేత ఐదేళ్లు పాలించిన దాఖలాలు లేవు. భారత్ పాక్ పైకి దాడులకు దిగి అన్ని స్థావరాలను నాశనం చేస్తుంటే సైన్యం ఏం చేస్తుందంటూ సైన్యంపై అక్కడ సోషల్ మీడియాలో సెటైర్లు వినిపించాయి. నిద్రపోతున్నారా? అంటూ కొందరు నిలదీశారు. పోయిన పరువును నిలుపుకునేందుకు కాల్పుల విరమణ బ్రేక్ కు పాక్ సైన్యం పాల్పడిందని భావిస్తున్నారు. ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రభుత్వం అంగీకరిస్తుంటే సైన్యం అంగీకరించకపోవడానికి కారణం తమ పరువును నిలుపుకోవడానికేనని అంటున్నారు. అందుకే సరిహద్దుల్లో కాల్పులకు దిగి తమ వంకర బుద్ధిని పాక్ సైన్యం మరోసారి చోటు చేసుకుంది.
Next Story

