థాయ్‌లాండ్-కంబోడియా వార్.. ఏమవుతుందో?
దక్షిణాసియాలో మరో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. థాయ్‌లాండ్, కంబోడియా సైనికుల మధ్య సరిహద్దు వెంబడి ఘర్షణలు తీవ్రమయ్యాయి.

దక్షిణాసియాలో మరో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. థాయ్‌లాండ్, కంబోడియా సైనికుల మధ్య సరిహద్దు వెంబడి ఘర్షణలు తీవ్రమయ్యాయి. కంబోడియా సైన్యం ఆర్టిలరీ, రాకెట్లతో భారీ ఆయుధాలను ఉపయోగించినట్టు థాయ్‌లాండ్ సైన్యం తెలిపింది. గత దశాబ్దంలో జరిగిన అత్యంత తీవ్రమైన సరిహద్దు ఘర్షణల కారణంగా నాలుగు సరిహద్దు ప్రావిన్స్‌ల నుంచి 100,000 మందికి పైగా ప్రజలను దాదాపు 300 తాత్కాలిక ఆశ్రయ కేంద్రాలకు తరలించారు.
థాయ్ భూభాగంపై కంబోడియా రాకెట్లు, ఆర్టిలరీని ప్రయోగించగా, థాయ్‌లాండ్ ఎఫ్-16 ఫైటర్ జెట్లను ఉపయోగించి సరిహద్దు ఆవల సైనిక లక్ష్యాలపై దాడులకు దిగింది. ఐదుగురు థాయ్ సైనికులు ల్యాండ్‌మైన్ పేలుడులో గాయపడటంతో కంబోడియా రాయబారిని థాయ్‌లాండ్ బహిష్కరించింది. 800 కిలోమీటర్ల సరిహద్దుపై ఇరు దేశాల మధ్య దీర్ఘకాలికంగా వివాదం ఉంది. 2008 నుంచి 2011 వరకు జరిగిన ఘర్షణలలో కనీసం 28 మంది మరణించారు. వేలాది మంది నిర్వాసితులయ్యారు.మే నెలలో ఒక కంబోడియా సైనికుడు మరణించడంతో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి.

