Fri Dec 19 2025 04:08:45 GMT+0000 (Coordinated Universal Time)
Bangladesh : బంగ్లాదేశ్ లో కొనసాగుతున్న నిరసనలు.. రోడ్లపైకి వచ్చి ఆందోళనలు
బంగ్లాదేశ్ లో నిరసనలు కొనసాగుతున్నాయి.

బంగ్లాదేశ్ లో నిరసనలు కొనసాగుతున్నాయి. భారత్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసే నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణించడంతో ఢాకాలో ఒక్కసారి హింసాత్మక ఘటనలు చెలరేగాయి. వేలాది మంది రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలియజేశారు. ఢాకా రాజధాని కార్వాన్బజార్లోని ప్రముఖ పత్రికలు ప్రథమ్ ఆలో, డైలీ స్టార్ కార్యాలయాలపై దాడులు జరిగాయి. డైలీ స్టార్ భవనానికి నిప్పు పెట్టినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. గురువారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ప్రథమ్ ఆలో కార్యాలయంపై మొదట దాడి మొదలైందని సమాచారం. అనంతరం డైలీ స్టార్ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని గుంపు దాడి చేసింది.
దాడులకు పాల్పడి...
ఇంకిలాబ్ మాంచా ప్రతినిధి షరీఫ్ ఉస్మాన్ బిన్ హాది మృతి చెందిన వార్త వెలువడిన తరువాత, కొందరు అక్కడికి చేరుకుని ఈ దాడులకు పాల్పడ్డారని నగరిక్ పేర్కొంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లైవ్ వీడియోల్లో కర్రలతో విధ్వంసం చేస్తూ ఆందోళన కారులు తిరుగాడుతున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. ప్రథమ్ ఆలో కార్యాలయం ముందు రోడ్డుపై మంటలు కూడా చెలరేగడంతో వాటిని ఆర్పేందుకు సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. ఈ రెండు కార్యాలయాల్లో కొంతమంది ఉద్యోగులు చిక్కుకుపోయినట్లు సమాచారం. భద్రతా బలగాలు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
కాల్పుల్లో గాయపడి...
ఇంకిలాబ్ మాంచా ప్రతినిధి షరీఫ్ ఉస్మాన్ హాది గత శుక్రవారం ఢాకాలో జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం సింగపూర్ జనరల్ హాస్పిటల్‌కు తరలించిన ఆయన అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఢాకా ట్రిబ్యూన్ తెలిపింది. రాబోయే జాతీయ ఎన్నికల్లో ఢాకా–8 నియోజకవర్గ అభ్యర్థిగా ఆయన పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. డిసెంబర్ 12న పురానా పల్టన్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం కోసం బ్యాటరీ రిక్షాలో వెళ్తుండగా వెనుక నుంచి మోటార్‌సైకిల్‌పై వచ్చిన దుండగుడు కాల్పులు జరిపినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. బుల్లెట్ ఎడమ చెవి పైన ప్రవేశించి కుడివైపు బయటకు వెళ్లడంతో మెదడు కండరాలకు తీవ్ర నష్టం జరిగిందని వైద్యులు చెప్పారు.
సంతాపదినంగా...
షరీఫ్ ఉస్మాన్ హాది మృతి నేపథ్యంలో శనివారం, డిసెంబర్ 20, 2025ను జాతీయ సంతాప దినంగా ప్రకటిస్తున్నట్లు బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనస్ ప్రకటించారు. శుక్రవారం జుమ్మా ప్రార్థనల అనంతరం హాది ఆత్మశాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నట్లు చెప్పారు. మార్టిర్ ఉస్మాన్ హాది కుటుబం సంక్షేమ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని యూనస్ పేర్కొన్నారు. బంగ్లాదేశ్ లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో భారత హైకమిషనర్ కార్యాలయాన్ని మూసివేసిన సంగతి తెలిసిందే. పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది.
Next Story

