EU Trade Deal : ప్రపంచంలో అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతాలకు మార్గం సుగమం
పరాగ్వే మంగళవారం మెర్కోసూర్–యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన కీలక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి ఆమోదం తెలిపింది

పరాగ్వే మంగళవారం మెర్కోసూర్–యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన కీలక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి ఆమోదం తెలిపింది. దీంతో దక్షిణ అమెరికా దేశాల నుంచి ఈ ఒప్పందానికి ఆమోదం తెలిపిన చివరి దేశంగా నిలిచింది. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య ప్రాంతాల్లో ఒకటి ఏర్పడనుంది. యూరోపియన్ కమిషన్ ఈ ఒప్పందాన్ని తాత్కాలికంగా అమలు చేయాలని ఇప్పటికే ప్రకటించింది. యూరోపియన్ కోర్టులో న్యాయపరమైన సవాళ్లు కొనసాగుతున్నా, ఒప్పందం అమలుకు అడ్డంకి ఉండదని తెలిపింది. సుమారు 25 ఏళ్ల చర్చల తర్వాత ఈ ఒప్పందం రూపుదిద్దుకుంది. 700 మిలియన్లకు పైగా జనాభా ఉన్న దేశాలు ఇందులో భాగస్వాములు. ప్రపంచ స్థూల దేశీయోత్పత్తిలో 25 శాతం వాటా ఈ దేశాలదే. పరాగ్వే పార్లమెంట్ సమావేశంలో హాజరైన 58 మంది సభ్యులు ఏకగ్రీవంగా దీనికి మద్దతు తెలిపారు. సెనెట్ ఇప్పటికే ఆమోదం తెలిపిన నేపథ్యంలో, ఇప్పుడు అధ్యక్షుడు సాంటియాగో పెన్యా సంతకం చేయాల్సి ఉంది.

