Wed May 14 2025 04:46:41 GMT+0000 (Coordinated Universal Time)
Pakistan : దాయాది దేశానికి మరో ముప్పు.. బలోచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటనతో?
పాకిస్తాన్ ఇంటా బయటా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. బలోచ్ లిబరేషన్ ఆర్మీ రెచ్చిపోతుంది

పాకిస్తాన్ ఇంటా బయటా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఒకవైపు భారత్ తో కయ్యానికి కాలు దువ్వికోరి ఆపదను తెచ్చుకుంటే మరోవైపు స్వదేశంలో వేర్పాటు వాద ఉద్యమంతో మరింతగా ఇబ్బందులపాలవుతుంది. ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు జరిపిన భారత్ తో కయ్యానికి దిగకుండా ఉండి ఉంటే పాకిస్తాన్ కు ఈ పరిస్థితి దాపురించేది కాదు. ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు చేస్తే తమకు నష్టం జరిగిందని భావించి పాక్ సరిహద్దుల్లో కాల్పులకు తెగపడటంతో పాటు డ్రోన్లతో దాడులకు దిగుతుండటంతో పాక్ నష్ట పోయింది. అనేక డ్రోన్లను భారత్ గగనతలంలోనే పేల్చి పారేసింది. భారత్ కు జరిగిన స్వల్ప నష్టమే అయితే పాక్ మాత్రం భారీ నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది.
వేర్పాటు వాదంతో...
ఇక తాజాగా పాకిస్తాన్ లో వేర్పాటు వాద ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. బలోచిస్తాన్ వేరాటు ఉద్యమాన్ని అక్కడ తీవ్రతరం చేశారు. పాక్ లోని ఒక పట్టణాన్ని బలోచ్ లిబరేషన్ ఆర్మీ స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. దీంతో దాయాది దేశం ముప్పేట దాడిని ఎదుర్కొనాల్సి వస్తుంది. బలోచిస్తాన్ ప్రావిన్స్ లోని కాలత్ జిల్లా మంగోచర్ పట్టణాన్ని తమ అధీనంలోకి తీసుకున్నట్లు బలోచ్ లిబరేషన్ ఆర్మీ తెలిపింది. తాము ముప్ఫయి తొమ్మిది ప్రాంతాల్లో దాడులు చేశామని బలోచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటన చేసింది. తమ ఆపరేషన్ కంటిన్యూ అవుతుందని, పాక్ లోని మిలటరీ కాన్వాయ్ లపై దాడులకు దిగుతామని కూడా బలోచ్ లిబరేషన్ ఆర్మీ హెచ్చరించింది.
బలోచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటన మేరకు...
బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఇప్పటికే కొందరు పాక్ పోలీసులను అదుపులోకి తీసుకున్నట్లు కూడా ప్రకటించింది. పోలీస్ స్టేషన్ ను కూడా తమ నియంత్రణలో ఉందని పేర్కొంది. దీంతో పాటు రహదారులను దిగ్భంధించింది. పాక్ ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంది. మనీ విత్ డ్రాయల్ పై కూడా ఆంక్షలు విధించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంధన కొరత కూడా తీవ్రం కావడంతో పెట్రోలు బంకులు కొన్ని రోజుల పాటు మూసివేయాలని ప్రకటించినట్లు కూడా ప్రచారం జరిగింది. బలోచ్ లిబరేషన్ ఆర్మీ దాడుల్లో పాక్ సైనికులు మరణిస్తున్నారు. దాదాపు ఇరవై రెండు మంది పాక్ సైనికులు మరణించినట్లు బలోచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. పాక్ ఇప్పటికైనా దిగి వస్తుందా? రాదా? అన్నది చూడాలి.
Next Story