Sat Nov 02 2024 09:07:26 GMT+0000 (Coordinated Universal Time)
టర్కీ భూకంప ప్రభావం : 23 వేల మందికి పైగా మృతి
శిథిలాలు తొలగించే కొద్దీ.. మృతదేహాలు బయటపడుతున్నాయి. డబ్ల్యూహెచ్ఓ అంచనాలను మించి..
టర్కీ, సిరియా దేశాల్లో వచ్చిన భూకంపం.. ఇప్పట్లో మరచిపోలేని విషాదాన్ని మిగిల్చింది. భూకంపం వచ్చి ఆరురోజులైనా.. ఇంకా అక్కడ హృదయవిదారక పరిస్థితులే కనిపిస్తున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాలు తొలగించే కొద్దీ.. మృతదేహాలు బయటపడుతున్నాయి. డబ్ల్యూహెచ్ఓ అంచనాలను మించి మృతదేహాల సంఖ్య పెరుగుతోంది. క్కడ చూసినా శిథిలాల దిబ్బలు.. సామూహిక ఖననాలు.. బాధితుల రోదనలు. ఇంకా వేల మంది సాయం కోసం శిథిలాల కింద ఎదురుచూస్తున్నారు. ఇప్పటికి 23వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
టర్కీలో 20,213 మంది, సిరియాలో 3,553 మంది ప్రాణాలు కోల్పోయినట్టు గుర్తించారు. 77,711 మందికి పైగా గాయపడ్డారు. మృతదేహాలను సామూహికంగా సమాధి చేస్తున్నారు. 1990 తర్వాత అంటే దాదాపు 33 ఏళ్ల తర్వాత.. ఇంత పెద్ద విపత్తు సంభవించింది. భూకంపంతో ఇంతమంది చనిపోవడం 20 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి అంటున్నారు. సహాయక చర్యలు పూర్తయ్యే సరికి ఈ లెక్కలు ఎక్కడివరకూ వెళ్తాయో.. ఇంకెంత మంది ప్రాణాలు పోతాయోనన్న ఊహే భయంకరంగా ఉంటోంది.
సిరియాలో సుమారు 5.3మిలియన్ మంది ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులుగా మారారు. టర్కీలోనూ లక్షలాది మంది గూడు కోల్పోయి.. 6 రోజులుగా రోడ్ల మీదే గడుపుతున్నారు. తిండీ, తిప్పలు లేక.. అయిన వారిని పోగొట్టుకుని.. ఓదార్చే వారు లేక.. తీవ్ర దుఃఖంలో ఉన్నారు. వారి దీన స్థితిని చూసి తట్టుకోలేని కొందరు రెస్టారెంటు యజమానులు.. ఆహారం అందిస్తున్నారు. సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బందికీ ఆహారం అందించి.. కష్టకాలంలో చేయూతనందిస్తున్నారు.
Next Story