Fri Dec 05 2025 23:15:01 GMT+0000 (Coordinated Universal Time)
ఉత్తర కొరియాలో కరోనా విస్ఫోటం.. 3 రోజుల్లో 8 లక్షలకు పైగా కేసులు
తాజాగా ఆదివారం 15 మంది తీవ్రజ్వరంతో చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 42కు పెరిగింది. కరోనా తీవ్రతరం అవుతుండటంతో..

ఉత్తర కొరియాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రపంచమంతా కరోనా ఉన్న సమయంలో అక్కడ ఒక్కకేసు కూడా రాకుండా జాగ్రత్తపడిన ఉత్తర కొరియా.. ఇప్పుడు కరోనా క్లిష్టపరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. కేవలం మూడంటే మూడ్రోజుల్లో 8 లక్షలకు పైగా కేసులు కేసులు నమోదవ్వడం.. ఆందోళన కలిగిస్తోంది. కఠిన లాక్ డౌన్లు, క్వారంటైన్ రూల్స్ ఏవీ కరోనాను అదుపుచేయలేక పోతున్నాయి. ఇప్పటి వరకూ అక్కడ 8,20,620 కేసులు నమోదవ్వగా.. బాధితుల్లో 3,24,550 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
తాజాగా ఆదివారం 15 మంది తీవ్రజ్వరంతో చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 42కు పెరిగింది. కరోనా తీవ్రతరం అవుతుండటంతో ఉత్తర కొరియా దేశమంతా లాక్ డౌన్ విధించింది. రాష్ట్రాలు, నగరాలు, కౌంటీల్లో కఠిన ఆంక్షలతో కూడిన లాక్ డౌన్ కొనసాగుతుందని.. ఆ దేశ అధికారిక పత్రిక కేసీఎన్ఏ వెల్లడించింది. అక్కడ పని ప్రాంతాలు, ఉత్పత్తి యూనిట్లు, ఫ్యాక్టరీలన్నింటినీ ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా మూసివేసినట్లు కేసీఎన్ఏ పేర్కొంది. కాగా.. గత గురువారమే ఉత్తరకొరియా తమ దేశంలోకి ఒమిక్రాన్ ఎంటరైందని ప్రకటించింది. దేశంలో కేసులు పెరిగిపోతుండటంతో అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆందోళన వ్యక్తం చేశారు.
Next Story

