North Korea : చర్చల విఫలం తర్వాత టార్గెట్ అమెరికా.. స్వయంగా పరీక్షించిన అధినేత
ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ అమెరికాను లక్ష్యంగా చేసుకునే క్షిపణుల సామర్థ్యాన్ని స్వయంగా పరీక్షించారు

ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ అమెరికాను లక్ష్యంగా చేసుకునే క్షిపణుల సామర్థ్యాన్ని స్వయంగా పరీక్షించారు. అధిక సామర్థ్యంతో పనిచేసే ఘన ఇంధన ఇంజిన్ భూమిపై చేసిన పరీక్షను స్వయంగా వీక్షించారు. ఇది దేశ వ్యూహాత్మక సైనిక సామర్థ్యాన్ని పెంచే కీలక అభివృద్ధి అని ఆయన ప్రశంసించినట్లు అధికార వార్తా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ఆదివారం వెల్లడించింది.ఈ పరీక్ష అమెరికా ప్రధాన భూభాగాన్ని చేరగల క్షిపణుల సామర్థ్యాన్ని పెంచి, ఆయుధ సంపత్తిని విస్తరించాలనే కిమ్ సంకల్పాన్ని సూచిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఉత్తర కొరియా పార్లమెంట్లో కిమ్ చేసిన ప్రసంగంలో దేశాన్ని శాశ్వత అణు శక్తిగా నిలబెట్టే దిశగా అడుగులు వేస్తామని చెప్పారు. మధ్యప్రాచ్య యుద్ధాన్ని ప్రస్తావిస్తూ అమెరికాపై ‘రాష్ట్ర ఉగ్రవాదం, దాడి ధోరణి’ ఆరోపణలు చేశారు. కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ నివేదిక ప్రకారం కార్బన్ ఫైబర్ పదార్థంతో అప్గ్రేడ్ చేసిన ఈ కొత్త ఇంజిన్ గరిష్ఠంగా ఒత్తిడి 2,500 కిలోటన్నులుగా నమోదైంది. సెప్టెంబరులో జరిగిన ఇలాంటి ఘన ఇంధన ఇంజిన్ పరీక్షలో ఇది సుమారు 1,971 కిలోటన్నులుగా ఉండేది.

