Mon Jan 05 2026 13:58:37 GMT+0000 (Coordinated Universal Time)
Venezuela : మదురోకు అండగా కిమ్.. అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్
వెనెజులాపై దాడిని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ ఖండించారు

వెనిజువెలా అధ్యక్షుడు మదురోను అరెస్ట్ చేయడం, ఆ దేశం పై దాడికి దిగడాన్ని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ తీవ్రంగా ఖండించారు. వెనిజువెలా అధ్యక్షుడు నికోలాస్ మదురోను అమెరికా అదుపులోకి తీసుకోవడాన్ని ఉత్తర కొరియా ఆదివారం తీవ్రంగా ఖండించింది. ఇది ఆ దేశ సార్వభౌమాధికారంపై తీవ్రమైన దాడి అని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ మీడియా తెలిపింది.అమెరికా ఆధిపత్య ధోరణి స్పష్టమైందని అన్నారు. వెనిజువెలాలో అమెరికా చేసిన చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఉత్తర కొరియా విదేశాంగ శాఖ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. అధికారిక కీసీఎన్ఏ ఈ ప్రకటనను ప్రసారం చేసింది. “ఈ ఘటన అమెరికా దుర్మార్గ, కఠిన స్వభావాన్ని మరోసారి స్పష్టంగా చూపిస్తోంది” అని ప్రతినిధి వ్యాఖ్యానించారు.
తమ ప్రభుత్వాన్ని కూడా...
శనివారం తెల్లవారుజామున అమెరికా ప్రత్యేక దళాలు వెనిజువెలా రాజధాని కారాకాస్ పరిసరాల్లో వైమానిక దాడులు చేపట్టి, మదురోను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అనంతరం ఆయనను, ఆయన భార్యను హెలికాప్టర్లో న్యూయార్క్‌కు తరలించారు. అక్కడ మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణా కేసుల్లో వారిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిణామం ఉత్తర కొరియా నేతృత్వానికి భయంకర పరిస్థితిగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. వాషింగ్టన్ తమ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు చేస్తోందని ప్యాంగ్యాంగ్ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. ఇదే కారణంతో తమ అణు, క్షిపణి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని ఉత్తర కొరియా చెబుతోంది. కారాకాస్‌లో మదురో నేతృత్వంలోని సోషలిస్టు ప్రభుత్వానికి ప్యాంగ్యాంగ్ బహిరంగ మద్దతు తెలిపింది.
అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి...
అంతర్జాతీయ చట్టాలకు ఘోర ఉల్లంఘన అని ఉత్తర కొరియా వ్యాఖ్యానించింది. ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించే అమెరికా అలవాటుపై ప్రపంచం వ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని పిలుపునిచ్చింది. ఒక రకంగా కిమ్ అభిప్రాయాన్నే ఈదేశ విదేశాంగ ప్రతినిధి వెల్లడించినట్లయింది. కిమ్ ఇప్పటికే మదురో తనకు మంచి స్నేహితుడని చెప్పారు. అక్కడి ఆయిల్ నిక్షేపాలను,బంగారు గనులపై కన్నేసిన అమెరికా వాటిని తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు మాత్రమే ఇటువంటి చర్యలకు దిగిందని, దానికి డ్రగ్స్ అంటూ దొంగ నాటకాలకు తెరదీసిందన్న ఆరోపణలకు దిగింది. వెనెజులాలో కూడా అమెరికా జోక్యం కారణంగానే తాము తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని ఎక్కువ మంది ప్రజలు అభిప్రాయపడుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి.
Next Story

