Thu Apr 09 2026 10:21:41 GMT+0530 (India Standard Time)
North Korea : ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు... దక్షిణ కొరియా టార్గెట్ గా
ఉత్తర కొరియా ఈ వారం నిర్వహించిన పరీక్షల్లో కొత్త రకాల ఆయుధ వ్యవస్థలను వినియోగించినట్లు గురువారం వెల్లడించింది

ఉత్తర కొరియా ఈ వారం నిర్వహించిన పరీక్షల్లో కొత్త రకాల ఆయుధ వ్యవస్థలను వినియోగించినట్లు గురువారం వెల్లడించింది. దక్షిణ కొరియాను లక్ష్యంగా చేసుకుని అణు సామర్థ్యం కలిగిన దళాలను విస్తరించే ప్రయత్నంలో భాగంగా ఈ పరీక్షలు చేపట్టినట్లు పేర్కొంది. దక్షిణ కొరియా సైన్యం తూర్పు తీర ప్రాంతం నుంచి ఉత్తర కొరియా పలుమార్లు క్షిపణులు ప్రయోగించినట్లు గుర్తించిన ఒక రోజు తర్వాత, ఉత్తర కొరియా అధికార మీడియా ఈ వివరాలను వెల్లడించింది. ఉత్తర కొరియా అధికార వార్తా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం ప్రారంభమైన ఈ పరీక్షలు మూడు రోజుల పాటు కొనసాగాయి. వీటిలో వైమానిక దాడులను ఎదుర్కొనే ఆయుధాలు, ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఆయుధ వ్యవస్థలు, కార్బన్ ఫైబర్ బాంబుల ప్రదర్శన కూడా జరిగింది.
ప్యోగ్యాంగ్ నుంచి...
దక్షిణ కొరియా సంయుక్త సైన్యాధికారుల విభాగం తెలిపిన వివరాల ప్రకారం, బుధవారం ప్రయోగించిన క్షిపణులు 240 నుంచి 700 కిలోమీటర్ల దూరం ప్రయాణించి సముద్రంలో పడ్డాయి. మంగళవారం ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్ సమీపం నుంచి కనీసం ఒక ప్రాజెక్టైల్ ప్రయోగించినట్లు గుర్తించామని పేర్కొంది. జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన ప్రకారం, బుధవారం ప్రయోగించిన ఆయుధాల్లో ఏదీ తమ ప్రత్యేక ఆర్థిక జోన్ జలాల్లోకి రాలేదు. అమెరికా సైన్యం కూడా మంగళవారం, బుధవారం జరిగిన ప్రయోగాలు అమెరికా లేదా దాని మిత్రదేశాలకు తక్షణ ముప్పు కాదని తెలిపింది. కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం, తాజా పరీక్షల్లో అణు సామర్థ్యం కలిగిన హ్వాసాంగ్-11 బాలిస్టిక్ క్షిపణి పై క్లస్టర్ మ్యూనిషన్ వార్‌హెడ్ వ్యవస్థను అమర్చిన ప్రదర్శన జరిగింది. ఇవి తక్కువ ఎత్తులో మలుపులు తిరుగుతూ ప్రయాణించేలా రూపొందించబడ్డాయి. రష్యా ఇస్కాండర్ క్షిపణి నమూనాకు ఇవి పోలికలుగా ఉన్నాయని నివేదిక తెలిపింది. ఇలాంటి వార్హెడ్లతో అమర్చినప్పుడు 6.5 నుంచి 7 హెక్టార్ల పరిధిలోని లక్ష్యాన్ని పూర్తిగా ధ్వంసం చేసే శక్తి ఈ క్షిపణికి ఉందని పేర్కొంది.
ఉద్రిక్తలు మరింతగా...
దక్షిణ కొరియా సంయుక్త సైన్యాధికారుల ప్రతినిధి జాంగ్ డో-యాంగ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఈ ప్రయోగాలపై విశ్లేషణ కొనసాగుతోందని, అమెరికా, జపాన్‌తో సమాచారం పంచుకుంటున్నామని తెలిపారు. అయితే ఉత్తర కొరియా చేసిన సైనిక సామర్థ్య పురోగతి దావాలపై ప్రత్యేక వ్యాఖ్య చేయలేదు. ఈ ప్రయోగాలు కొరియా ద్వీపకల్పంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలను మరింతగా బయటపెట్టాయి. దక్షిణ కొరియా ఆశించిన సాన్నిహిత్య ప్రయత్నాలకు ఇది విరుద్ధంగా మారింది. మంగళవారం రాత్రి ప్యోంగ్యాంగ్ విదేశాంగ శాఖ మొదటి ఉపమంత్రి జాంగ్ కుమ్ చోల్ ప్రకటనలో, దక్షిణ కొరియా ఎప్పటికీ తమకు “అత్యంత శత్రుత్వ దేశం”గానే ఉంటుందని పేర్కొన్నారు. చర్చలను పునరుద్ధరించాలనే సియోల్ ప్రభుత్వ ప్రయత్నాలను ఎగతాళి చేశారు.ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ 2019లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో అణు చర్చలు విఫలమైన తర్వాత సియోల్, వాషింగ్టన్‌లతో దౌత్యాన్ని దాదాపుగా నిలిపివేశారు. ఆ తర్వాత అణు సామర్థ్య క్షిపణుల అభివృద్ధిని వేగవంతం చేశారు.అలాగే రష్యా, చైనా తదితర దేశాలతో సంబంధాలను బలోపేతం చేస్తూ అంతర్జాతీయ వేదికపై తమ స్థితిని బలపరచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తర కొరియా అధికార మీడియా ప్రకారం, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి గురువారం రెండు రోజుల పర్యటన కోసం దేశానికి రానున్నారు.
Next Story

