Sat Mar 21 2026 11:20:14 GMT+0530 (India Standard Time)
Israel Attack : లెబనాన్‌లో వైద్య కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి
దక్షిణ లెబనాన్‌లోని బుర్జ్ ఖలౌయియా గ్రామంలో ఆరోగ్య కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి తీవ్ర విషాదానికి దారితీసింది

దక్షిణ లెబనాన్‌లోని బుర్జ్ ఖలౌయియా గ్రామంలో ఆరోగ్య కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి తీవ్ర విషాదానికి దారితీసింది.ఈ దాడిలో 12 మంది వైద్య సిబ్బంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. నలుగురు శిథిలాల కింద గంటల పాటు చిక్కుకుపోయారు. మార్చి 2 నుంచి ప్రారంభమైన తాజా ఇజ్రాయెల్–హిజ్బుల్లా యుద్ధంలో ఇది అత్యంత ప్రాణనష్టం కలిగించిన దాడుల్లో ఒకటిగా భావిస్తున్నారు. ఈ కేంద్రాన్ని హిజ్బుల్లా అనుబంధ సంస్థ ‘ఇస్లామిక్ హెల్త్ సొసైటీ’ నిర్వహిస్తోంది. గత రెండు వారాల్లో ఈ సంస్థకు చెందిన 24 మంది సభ్యులు మృతి చెందినట్లు సమాచారం.
పౌర సంస్థలపైనా దాడులు...
ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ సైన్యం కేవలం హిజ్బుల్లా సైనిక లక్ష్యాలనే కాకుండా, దాని పౌర సంస్థలను కూడా లక్ష్యంగా చేసుకుంటోందని విశ్లేషకులు చెబుతున్నారు. దీని వల్ల ఇరాన్ మద్దతు ఉన్న ఈ గ్రూప్ బలహీనపడుతుందని, దాని అనుచరులను దూరం చేయాలన్న ప్రయత్నం జరుగుతోందని భావిస్తున్నారు. హిజ్బుల్లా రాజకీయ పార్టీగానూ, సాయుధ సంస్థగానూ పనిచేస్తోంది. దాని ఆరోగ్య, సామాజిక సేవా సంస్థలు సంవత్సరాలుగా ప్రజల్లో బలమైన మద్దతు పెంచాయి. ఇప్పటివరకు ఇజ్రాయెల్ దాడుల్లో హిజ్బుల్లా ఆర్థిక విభాగం ‘అల్-ఖర్డ్ అల్-హసన్’కు చెందిన డజనుకు పైగా శాఖలు ధ్వంసమయ్యాయి. ‘అల్-మనార్’ టీవీ కార్యాలయం, ‘అల్-నూర్’ రేడియో స్టేషన్లు కూడా తీవ్ర నష్టం చవిచూశాయి. ‘అమానా’ గ్యాస్ స్టేషన్లు, తక్కువ ధరల సరుకులు అమ్మే ‘సజ్జాద్’ దుకాణాలపైనా దాడులు జరిగాయి. బీరుట్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌పై జరిగిన దాడిలో ‘అల్-మనార్’ టీవీ రాజకీయ కార్యక్రమాల అధికారి మహ్మద్ షెర్రీ, అతని భార్య మృతి చెందారు.
ఆరోపణలు–ఖండనలు...
హిజ్బుల్లా ఆరోగ్య కేంద్రాలను సైనిక అవసరాలకు ఉపయోగిస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. అలాగే ‘అల్-ఖర్డ్ అల్-హసన్’ ద్వారా సైనిక కార్యకలాపాలకు నిధులు సమకూరుతున్నాయని చెబుతోంది. అయితే ఈ ఆరోపణలను లెబనాన్ ఆరోగ్య శాఖ ఖండించింది.అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ బీరుట్కు చెందిన రాజకీయ శాస్త్రవేత్త హిలాల్ ఖషాన్ మాట్లాడుతూ, “ఇది కాల్పుల విరమణతో ముగిసే యుద్ధం కాదు. హిజ్బుల్లాను పూర్తిగా రాజకీయ రంగం నుంచి తొలగించడమే లక్ష్యం” అని అన్నారు.
ఒత్తిడిలో హిజ్బుల్లా...
హిజ్బుల్లాపై అంతర్గతంగా, అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతోంది. దక్షిణ లెబనాన్ సరిహద్దుల్లో ఇజ్రాయెల్ సైన్యంతో జరిగిన ఘర్షణల్లో అనేక మంది యోధులు మృతి చెందారు. ఇజ్రాయెల్ సైన్యాధిపతి ఎయాల్ జమీర్ మాట్లాడుతూ, “హిజ్బుల్లా ఇప్పుడు తన ఉనికి కోసం యుద్ధం చేస్తోంది. ఈ పోరాటంలో భారీ మూల్యం చెల్లిస్తోంది” అన్నారు. దీనిపై హిజ్బుల్లా నేత నయీమ్ ఖాసెం స్పందిస్తూ, “ఇది సాధారణ పోరాటం కాదు. చివరివరకు పోరాడతాం. లొంగిపోం” అని ప్రకటించారు.
లెబనాన్‌లో రాజకీయ ఉద్రిక్తత...
లెబనాన్ ప్రభుత్వం హిజ్బుల్లా సాయుధ కార్యకలాపాలను చట్టవిరుద్ధంగా ప్రకటించింది. అనుమతి లేకుండా ఆయుధాలు కలిగి ఉన్నందుకు కొందరిని అదుపులోకి తీసుకుంది. హిజ్బుల్లాపై విమర్శలు కూడా పెరుగుతున్నాయి. ఇరాన్ మద్దతుతో ఇజ్రాయెల్‌పై రాకెట్లు ప్రయోగించడం వల్లే ఈ యుద్ధం మొదలైందని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు వెయ్యికి పైగా మంది మరణించారు. దాదాపు 10 లక్షల మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను విడిచి వెళ్లాల్సి వచ్చింది.
అంతర్జాతీయ విమర్శలు...
‘అమ్నెస్టీ ఇంటర్నేషనల్’ ప్రకారం, ‘అల్-ఖర్డ్ అల్-హసన్’ సంస్థలు సైనిక లక్ష్యాలు కావు. వాటిపై దాడులను యుద్ధ నేరాలుగా విచారించాలన్నారు.సంస్థ ప్రతినిధి హెబా మొరాయెఫ్ మాట్లాడుతూ, “హిజ్బుల్లాతో సంబంధం ఉందని చెప్పి ఏదైనా లక్ష్యంగా తీసుకోవడం తప్పు” అన్నారు. హిజ్బుల్లా ఆరోగ్య విభాగానికి చెందిన మహ్మూద్ కరాకీ మాట్లాడుతూ, “మా మీద దాడి అంటే ప్రజల భద్రతపై దాడి చేసినట్టే” అన్నారు.
యుద్ధ విస్తరణపై సంకేతాలు...
అమెరికా–ఇజ్రాయెల్ దాడులు ఇరాన్‌పై ఆగితే, లెబనాన్‌పై కూడా దాడులు ఆగాలని హిజ్బుల్లా, ఇరాన్ అధికారులు చెబుతున్నారు.ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ మాట్లాడుతూ, “మేము కాల్పుల విరమణకంటే యుద్ధం పూర్తిగా ముగియాలని కోరుకుంటున్నాం” అన్నారు. ఈ వ్యాఖ్యలతో యుద్ధం మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Next Story

