Tue Jul 08 2025 17:21:17 GMT+0000 (Coordinated Universal Time)
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. గత కొద్ది గంటలుగా ఇరాన్ పలు దఫాలుగా ఇజ్రాయెల్ భూభాగాలపై క్షిపణులతో దాడులు చేసిన నేపథ్యంలో, ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించవద్దని ట్రంప్ ఇరు దేశాలను హెచ్చరించారు. ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా కూడా వెల్లడించింది. క్షిపణి దాడులు ముగియడంతో, ప్రజలు షెల్టర్ల సమీప ప్రాంతాల నుంచి బయటకు రావచ్చని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్లో జరిపిన చర్చల ద్వారా ట్రంప్ ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చారని, ఇరాన్ ఇకపై దాడులు చేయనంత కాలం ఇజ్రాయెల్ దీనికి అంగీకరించిందని వైట్‌హౌస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇరాన్ కూడా కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ధ్రువీకరించింది.
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు అమెరికా అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ సూచనల మేరకు కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్లు ప్రకటించారు. ఇరాన్ తో అణు ముప్పు తొలగిపోయిందని, ఇరాన్ తో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంటామని చెప్పారు. తొలుత ఇరాన్ కాల్పుల విరమణను ప్రారంభించింది. దీనికి ప్రతిస్పందనగా, తాము కూడా సీజ్‌ఫైర్‌కు కట్టుబడి ఉంటామని ఇజ్రాయెల్ ప్రకటించింది.
Next Story