Fri Mar 20 2026 12:08:33 GMT+0530 (India Standard Time)
Iran - Israel War : ఆసియా దేశాలలో తీవ్ర ప్రభావం.. ధరల పెరుగుదలతో ఆర్థిక ఒత్తిడి
ఇరాన్లో జరుగుతున్న యుద్ధం ప్రపంచం ఇంధన మార్గాలపై ఎంతగా ఆధారపడిందో బయటపెడుతోంది

ఇరాన్లో జరుగుతున్న యుద్ధం ప్రపంచం ఇంధన మార్గాలపై ఎంతగా ఆధారపడిందో బయటపెడుతోంది. ఈ పరిస్థితి పునరుత్పాదక శక్తి వైపు మార్పును వేగంగా తీసుకెళ్లాలన్న అవసరాన్ని ముందుకు తెచ్చింది. హోర్ముజ్ జలసంధి ద్వారా జరిగే చమురు రవాణా దాదాపు పూర్తిగా ఆగిపోయింది. ప్రపంచ చమురు, ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) సరఫరాలో సుమారు ఐదో వంతు ఈ మార్గం మీదే ఆధారపడుతుంది. ఈ అంతరాయం ఇంధన మార్కెట్లను కుదిపేసింది. ధరలు పెరగడంతో దిగుమతులపై ఆధారపడిన దేశాలపై ఒత్తిడి పెరిగింది. ఆసియా దేశాలకు ప్రభావం ఎక్కువగా పడింది. యూరప్‌లో కూడా ఇంధన వినియోగం తగ్గించే మార్గాలపై చర్చ మొదలైంది. ఆఫ్రికా దేశాలు పెరుగుతున్న ఇంధన ఖర్చులు, ద్రవ్యోల్బణం గురించి ఆందోళన చెందుతున్నాయి.
గతం కంటే భిన్నంగా...
ఇప్పటి పరిస్థితి గతంలోని ఇంధన సంక్షోభాల కంటే భిన్నంగా ఉంది. అనేక ప్రాంతాల్లో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి ఖర్చు, ఫాసిల్ ఇంధనాల కంటే తక్కువగా మారింది. 2024లో ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమైన కొత్త పునరుత్పాదక ప్రాజెక్టుల్లో 90 శాతం పైగా చౌకగా ఉన్నాయని అంతర్జాతీయ పునరుత్పాదక శక్తి సంస్థ వెల్లడించింది. చమురు కేవలం విద్యుత్ ఉత్పత్తికే కాదు. ఎరువులు, ప్లాస్టిక్ పరిశ్రమల్లో కూడా కీలకం. అందువల్ల చాలా దేశాలు ఈ ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి. అయితే సూర్యశక్తి, గాలిశక్తి వంటి దేశీయ వనరులపై ఆధారపడే దేశాలు కొంతవరకు రక్షణ పొందుతున్నాయి. “ఇలాంటి సంక్షోభాలు తరచూ వస్తుంటాయి. ఫాసిల్ ఇంధన వ్యవస్థలో ఇవి సహజ లక్షణం,” అని ఆస్ట్రేలియాకు చెందిన రీమ్యాప్ రీసెర్చ్ నిపుణుడు జేమ్స్ బోవెన్ తెలిపారు.
చైనా ముందంజ.. భారత్ నెమ్మదిగా
చైనా, భారత్ రెండూ భారీ జనాభాకు విద్యుత్ సరఫరా చేయాల్సిన సవాలు ఎదుర్కొంటున్నాయి. రెండూ పునరుత్పాదక శక్తిని పెంచుతున్నా, చైనా భారీ స్థాయిలో ముందుకు దూసుకెళ్లింది. ప్రస్తుతం పునరుత్పాదక శక్తిలో చైనా ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. చైనాలో ప్రతి 10 కార్లలో ఒకటి ఎలక్ట్రిక్ వాహనం. ఇంకా చమురు దిగుమతుల్లో ముందున్నా, పునరుత్పాదక శక్తి వినియోగం పెరగడంతో దిగుమతులపై ఆధారపడటం తగ్గింది. ఈ మార్పు లేకపోతే సరఫరా, ధరల షాక్‌లకు చైనా మరింతగా గురయ్యేదని నిపుణులు చెబుతున్నారు. తక్కువ ధరల సమయంలో నిల్వలు పెంచుకోవడం, అవసరానికి అనుగుణంగా బొగ్గు, చమురు వినియోగం మార్చుకునే సామర్థ్యం కూడా చైనాకు ఉంది. భారత్‌లో కూడా సౌరశక్తి, గాలిశక్తి పెరుగుతున్నా వేగం తక్కువ. ఉత్పత్తి పరికరాల తయారీ, గ్రిడ్ కనెక్షన్లలో ప్రభుత్వ మద్దతు కూడా తక్కువగా ఉంది.
యూరప్ దేశాలు ఇప్పటికే...
2022లో రష్యా–ఉక్రెయిన్ యుద్ధం తర్వాత భారత్ చౌక రష్యన్ చమురు కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇచ్చింది. బొగ్గు ఉత్పత్తిని కూడా పెంచింది. అదే సమయంలో పునరుత్పాదక శక్తి పెంపు కొంత ఉపశమనం ఇచ్చినా, పూర్తిగా సమస్యను నివారించలేకపోయింది. ప్రస్తుతం వంట గ్యాస్ కొరత భారత్‌లో కనిపిస్తోంది. దీంతో ఇండక్షన్ స్టౌవ్‌ల కొనుగోళ్లు పెరిగాయి. రెస్టారెంట్లు మూతపడే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఎరువులు, సిరామిక్ పరిశ్రమలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. అభివృద్ధి చెందిన దేశాలు మళ్లీ ఫాసిల్ ఇంధనాలవైపు మళ్లాయి. యూరప్, తూర్పు ఆసియా దేశాలకు ఇంధన సంక్షోభం కొత్త కాదు. 2022లో యూరప్ దేశాలు ఫాసిల్ ఇంధనాలపై ఆధారాన్ని తగ్గించాలనుకున్నాయి. కానీ త్వరలోనే కొత్త సరఫరాదారుల కోసం వెతకడం ప్రారంభించాయి.
గ్యాస్ ధరలు పెరుగుతూ...
జర్మనీ రష్యా గ్యాస్‌కు బదులుగా అమెరికా నుంచి ఎల్ఎన్జీ దిగుమతులకు టెర్మినల్స్ నిర్మించింది. ఈ క్రమంలో శక్తి మార్పు ప్రక్రియ నెమ్మదించింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం తర్వాత యూరప్ ఫాసిల్ ఇంధనాలపై చేసిన అదనపు ఖర్చు, స్వచ్ఛ శక్తి మార్పుకు అవసరమైన పెట్టుబడిలో సుమారు 40 శాతం వరకు ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. జపాన్‌లో కూడా ఇదే పరిస్థితి. పునరుత్పాదక శక్తిపై పెట్టుబడులు పెంచకుండా, ఫాసిల్ ఇంధన దిగుమతులను విస్తరించడం వైపు విధానాలు సాగుతున్నాయి.అయితే పేద దేశాలకు భారీ దెబ్బ తగులుతుంది. ఆసియా, ఆఫ్రికా పేద దేశాలు ఈ సంక్షోభాన్ని తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి. యూరప్, చైనా, భారత్ వంటి పెద్ద కొనుగోలుదారులతో పోటీ పడాల్సి వస్తోంది. దీంతో గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి.
ఈ దేశాల్లో ప్రభావం...
బెనిన్, జాంబియా, బంగ్లాదేశ్, థాయిలాండ్ వంటి దిగుమతులపై ఆధారపడిన దేశాలు ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి. ఇంధన ధరలు పెరగడంతో రవాణా, ఆహార ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. ఆఫ్రికా దేశాలు ముఖ్యంగా ఇబ్బంది పడుతున్నాయి. చాలా దేశాలు రవాణా, సరఫరా వ్యవస్థలకు దిగుమతి చమురుపైనే ఆధారపడుతున్నాయి.దీర్ఘకాలికంగా శక్తి భద్రత కోసం పునరుత్పాదక శక్తిలో పెట్టుబడులు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. అయితే కొన్ని దేశాలు ఇంకా గ్యాస్ ప్రాజెక్టుల వైపు మొగ్గుచూపుతున్నాయి. మరికొన్ని దేశాలు ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహం ద్వారా పునరుత్పాదక మార్గాన్ని ఎంచుకుంటున్నాయి.కొన్ని ఆసియా దేశాలకు పునరుత్పాదక శక్తి కొంత ఉపశమనం ఇచ్చింది. పాకిస్థాన్‌లో సౌరశక్తి పెరుగుదల వల్ల 2020 నుంచి 12 బిలియన్ డాలర్ల ఫాసిల్ ఇంధన దిగుమతులు తగ్గాయి.వియత్నాంలో కూడా సౌరశక్తి వల్ల వచ్చే ఏడాదిలో వందల మిలియన్ డాలర్ల దిగుమతి ఖర్చు తగ్గే అవకాశం ఉంది.మరోవైపు బంగ్లాదేశ్ విద్యుత్ ఆదా కోసం విశ్వవిద్యాలయాలు మూసివేసింది. ఇంధన రేషన్ విధానం అమలు చేస్తోంది. థాయిలాండ్ నిల్వలపై ఆధారపడుతోంది .“దేశీయ పునరుత్పాదక శక్తిని ముందుగానే ప్రోత్సహించాల్సింది,” అని థాయిలాండ్ నిపుణులు అభిప్రాయపడ్డారు.
Next Story

