Sun Mar 01 2026 09:33:22 GMT+0530 (India Standard Time)
Iran vs Israel : ఇరాన్ క్షిపణి దాడులతో ఇజ్రాయెల్‌లో ఉత్కంఠ
ఇరాన్ నుంచి వరుసగా క్షిపణి దాడులు కొనసాగడంతో ఇజ్రాయిల్ ప్రజలు రోజంతా బంకర్లలోనే తలదాచుకోవాల్సి వచ్చింది

ఇరాన్ నుంచి వరుసగా క్షిపణి దాడులు కొనసాగడంతో శనివారం ఇజ్రాయెల్ మధ్య ప్రాంతాల్లో ప్రజలు రోజంతా సురక్షిత కేంద్రాల్లో తలదాచుకోవాల్సి వచ్చింది. ఉదయం ఇజ్రాయెల్–అమెరికా సంయుక్తంగా ఇరాన్‌పై భారీ దాడి చేసిన కొద్ది సేపటికే ప్రతిగా ఇరాన్ దాడులు ప్రారంభించింది. అనేక ప్రాంతాల్లో ఉన్న అనేక అపార్ట్మెంట్లలో సరైన బంకర్లు లేవు. జఫ్ఫా లోని మిశ్రమ అరబ్–యూదు వసతి ప్రాంతంలో పార్కు కింద ఉన్న పబ్లిక్ షెల్టర్‌లో వంద మందికి పైగా చేరుకున్నారు. చిన్న పిల్లలతో వచ్చిన ముస్లిం కుటుంబాలు, సమీప సెమినరీకి చెందిన మతపరమైన యూదులు, కుక్కలు కూడా అక్కడే గుమికూడాయి.కొంతమంది తెచ్చుకున్న మంచాలపై పరుచుకుని కార్డులు ఆడారు. మరికొందరు తినుబండారాలు పంచుకున్నారు.
సైరన్లు మోగుతుండగానే...
రంజాన్ మాసం కారణంగా ఉపవాసం పాటిస్తున్న ముస్లింలు సైరన్లు మోగుతుండగానే మొబైల్ ఫోన్లలో తాజా సమాచారం చూస్తూ గడిపారు. సూర్యాస్తమయం కావడంతో రోజువారీ ఉపవాస విరమణ ‘ఇఫ్తార్’ను కూడా బంకర్లలోనే చేయాల్సి వచ్చింది. “ఇది జరుగుతుందని ఊహించాం. కానీ జరగకపోతే బాగుండేది,” అని పార్కు సమీపంలో నివసించే ఇడిట్ కోహెన్ అన్నారు. అయితే ఇలాంటి సమయంలో సమాజం ఒక్కటిగా నిలుస్తుందని ఆమె చెప్పారు. ఆమె కుమారుడికి రిజర్వ్ సైనిక సేవకు అత్యవసర పిలుపు వచ్చింది. శనివారం యూదుల పవిత్ర దినం ‘సబ్బత్’లో వాహనం నడపడం మానుకునే మతపరమైన యూదుడే అయినా, షెల్టర్‌లో ఉన్న ఓ వ్యక్తి అతడిని బేస్ వరకు తీసుకెళ్తానని ముందుకొచ్చాడు.
వరస యుద్ధాలతో...
“ఇది త్వరగా ముగియాలి. ప్రజలు అలసిపోయారు, చిరాకుపడుతున్నారు. చిన్న పిల్లలతో కుటుంబాలు ఇక్కడే ఉన్నారు. వృద్ధులు రోజంతా ఇలా పరుగులు తీయలేరు,” అని కోహెన్ తెలిపారు. గత రెండున్నరేళ్లుగా హమాస్ తో గాజా ప్రాంతంలో, హిజ్బుల్లా తో లెబనాన్‌లో, యెమెన్‌లో హూతీ తిరుగుబాటుదారులతో, అలాగే గత జూన్‌లో ఇరాన్‌తో 12 రోజుల యుద్ధం జరిగిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలకు ఈ పరిస్థితి కొత్తది కాదు. దేశంలో ఉన్న హెచ్చరిక వ్యవస్థ, బంకర్లు, క్షిపణి నిరోధక వ్యవస్థలు నష్టాన్ని కొంతవరకు తగ్గించాయి. అయినా పూర్తిగా అడ్డుకోలేకపోయాయి. ఇజ్రాయెల్ అత్యవసర సేవా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, టెల్ అవీవ్ పరిసరాల్లో ఇరాన్ దాడిలో గాయపడిన ఓ మహిళ మరణించారు. దేశవ్యాప్తంగా కనీసం 90 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.అనేక క్షిపణులను రక్షణ వ్యవస్థలు గాల్లోనే అడ్డుకున్నాయని సైన్యం తెలిపింది. అయితే కొన్ని ప్రాంతాల్లో స్వల్ప గాయాలు జరిగినట్లు పోలీసులు, అత్యవసర సిబ్బంది చెప్పారు.దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. పాఠశాలలు మూసివేశారు.
Next Story

