Tue Feb 03 2026 05:23:38 GMT+0000 (Coordinated Universal Time)
Tariffs : భారత్ - అమెరికా వాణిజ్య ఒప్పందం ఖరారు
భారత్ - అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంలో ముఖ్యమైన పరిణామం చోటు చేసుకుంది

భారత్ - అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంలో ముఖ్యమైన పరిణామం చోటు చేసుకుంది. గత కొన్నాళ్లుగా అదనపు సుంకాలతో ఇబ్బంది పెడుతున్న ట్రంప్ ఎట్టకేలకు దిగి వచ్చాడు. అనేక నెలలుగా సాగిన అనిశ్చితి, చర్చల తర్వాత అమెరికా–భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారైంది. ఈ ఒప్పందం ప్రకారం భారత వస్తువులపై అమెరికా విధిస్తున్న టారిఫ్‌లు 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గనున్నాయి. పరస్పర టారిఫ్‌ల తగ్గింపు, రష్యా చమురు కొనుగోళ్లపై విధించిన శిక్షాత్మక టారిఫ్‌ల తొలగింపుతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఫోన్ లో మాట్లాడిన తర్వాత...
దానికి ప్రతిగా అమెరికా ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న టారిఫ్‌లు, టారిఫ్ యేతర అడ్డంకులను పూర్తిగా తొలగించనుంది. దీంతో అమెరికా నుంచి జన్యుమార్పిడి చేసిన సోయాబీన్, మొక్కజొన్న, పాలు–పాల ఉత్పత్తులు దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. అలాగే అమెరికా నుంచి ఎనర్జీ, టెక్నాలజీ, బొగ్గు సహా ఇతర ఉత్పత్తులను మొత్తం 500 బిలియన్ డాలర్ల విలువ వరకు భారత్ కొనుగోలు చేయనుంది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఈ ఒప్పందాన్ని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేసి, అమెరికా, వెనిజువెలా నుంచి ఎక్కువగా చమురు కొనుగోలు చేయడానికి మోదీ అంగీకరించారని ట్రంప్ చెప్పారు. దీనివల్ల ఉక్రెయిన్ యుద్ధం ముగియడానికి దోహదపడుతుందని వ్యాఖ్యానించారు.
ప్రధాని మోదీ ట్వీట్...
ప్రధాని మోదీ స్నేహం, గౌరవం దృష్ట్యా ఆయన అభ్యర్థన మేరకు వెంటనే అమెరికా–భారత్ మధ్య వాణిజ్య ఒప్పందానికి అంగీకరించామని ట్రంప్ చెప్పారు. పరస్పర టారిఫ్‌ను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించామని ట్రంప్ తెలిపారు. భారత వస్తువులపై విధించే 18 శాతం టారిఫ్ ఆసియాలోని ఇతర దేశాలకు వర్తిస్తున్న స్థాయితో సమానమని చెప్పారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ టారిఫ్‌లు, ఇతర అడ్డంకులను సున్నాకు తగ్గిస్తుందని, ‘బై అమెరికన్’ విధానంలో భాగంగా భారీగా కొనుగోళ్లు చేస్తుందని వెల్లడించారు. ప్రధాని మోదీ కూడా రాత్రివేళ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో స్పందించారు. “అధ్యక్షుడు ట్రంప్‌తో మాట్లాడటం ఆనందంగా ఉంది. ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులపై టారిఫ్‌లు 18 శాతానికి తగ్గడం సంతోషంగా ఉంది. ఈ ప్రకటనకు భారత్ తరఫున ధన్యవాదాలు. రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిసి పనిచేస్తే ప్రజలకు లాభం, పరస్పర సహకారానికి విస్తృత అవకాశాలు లభిస్తాయి,” అని పేర్కొన్నారు.
Next Story

