Thu Dec 18 2025 10:42:16 GMT+0000 (Coordinated Universal Time)
బ్లాక్ మెయిల్ కు దిగిన బంగ్లాదేశ్...ఢాకాలో భారత హైకమిషన్ మూసివేత
బంగ్లాదేశ్‌లో క్షీణిస్తున్న భద్రతా పరిస్థితులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది

బంగ్లాదేశ్‌లో క్షీణిస్తున్న భద్రతా పరిస్థితులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ బంగ్లాదేశ్ హైకమిషనర్ రియాజ్ హమీదుల్లాను పిలిపించి తన ఆందోళనలను తెలియజేసింది. ఢాకాలోని భారత హైకమిషన్‌ను లక్ష్యంగా చేసుకుని అతివాద శక్తులు బెదిరింపులకు దిగుతున్న అంశాన్ని భారత్ ప్రత్యేకంగా ప్రస్తావించింది. మిషన్ సిబ్బంది, దౌత్యవేత్తల భద్రతకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది.బంగ్లాదేశ్‌లో హింసను భారత్ ప్రోత్సహిస్తోందన్న ఆరోపణలను న్యూఢిల్లీ పూర్తిగా ఖండించింది. అటువంటి తప్పుడు ప్రచారానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది.
ఢాకాలో ఉద్రిక్తతల నేపథ్యంలో...
రాడికల్ ఇస్లామిస్ట్ సంస్థ ‘ఘెరావ్’ హెచ్చరికల నేపథ్యంలో బుధవారం ఢాకాలోని భారత హైకమిషన్ చుట్టూ భారీ భద్రత ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి వీసా సేవలను తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది. సాయంత్రం సమయంలో పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు భారత హైకమిషనర్ కార్యాలయం వైపు కదలివచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను దాటేందుకు ప్రయత్నించగా, ఢాకా పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులు భారత్ వ్యతిరేక ప్రసంగాలు చేసినట్లు సమాచారం. అనంతరం వారు చెదరిపోయారు.
హెచ్చరికలతో...
బంగ్లాదేశ్‌లో భద్రతా వాతావరణం మరింత దిగజారుతున్న అంశంపై భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసింది. ఢాకాలోని భారత హై కమిషన్ చుట్టూ భద్రత సమస్యలు సృష్టిస్తామని అతివాద శక్తులు ప్రకటించిన విషయాన్ని హైకమిషనర్ దృష్టికి తీసుకొచ్చామని, ఇటీవలి ఘటనలపై తప్పుడు కథనాలను ఈ శక్తులు సృష్టిస్తున్నాయని వాటిని భారత్ పూర్తిగా తిరస్కరిస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇటీవలి ఘటనలపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం పూర్తిస్థాయి దర్యాప్తు చేయకపోవడం, నమ్మదగిన ఆధారాలు భారత్‌కు అందించకపోవడంపై విదేశాంగ మంత్రిత్వ శాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది.
హసీనాను అప్పగించాలంటూ...
భారత చర్యలకు మూడు రోజుల ముందే, మాజీ ప్రధాని షేక్ హసీనా భారత భూభాగం నుంచి చేసిన వ్యాఖ్యలు ఉద్రేక పూరితమైనవి అంటూ బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మను పిలిపించింది. అలాగే ఇన్కిలాబ్ మోంచ్ కన్వీనర్ షరీఫ్ ఉస్మాన్ హాది హత్యాయత్నానికి సంబంధించి అనుమానితులు భారత్‌లోకి వస్తే అరెస్ట్ చేసి నేరస్థుల అప్పగింత చేయాలని కోరింది. మరొకవైపు షేక్ షసీనాతో పాటు ఆమెతో వెళ్లిన వారిని తమకు అప్పగించాలని ఆందోళనకారులు కోరుతున్నారు. ప్రస్తుతం ఢాకాలోని భారత వీసా కేంద్రం మూసివేయాలని నిర్ణయించింది. తదుపరి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
Next Story

