Tue Jul 08 2025 17:18:07 GMT+0000 (Coordinated Universal Time)
Jinping : తిరుగులేని నాయకుడిపై తిరుబాటు .. జిన్ పింగ్ విషయంలో జరిగిందదేనా?
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కు పదవి కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన గత కొద్ది రోజుల నుంచి బయటకు కనిపించడం లేదు

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కు పదవి కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన గత కొద్ది రోజుల నుంచి బయటకు కనిపించడం లేదు. బ్రిక్స్ సమావేశాలకు కూడా హాజరు కాలేదు. జిన్ పింగ్ బ్రిక్స్ సమావేశాలకు హాజరుకారని, ఆయన స్థానంలో ప్రధాని లీ క్వియాంగ్ హాజరవుతారని ఆదేశ విదేశాంగ ప్రతినిధి చెప్పడంతో జిన్ పింగ్ శకం ముగిసినట్లేననన్న అంతర్జాతీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి. నియంతను అధికారం నుంచి దించేస్తారని నియంతృత్వానికి కూడా కాలం చెల్లిపోయిందని కథనాలు అంతర్జాతీయ మీడియాల్లో వెలువడుతున్నాయి. ఇప్పటి వరకూ జిన్ పింగ్ బ్రిక్స్ సదస్సుకు హాజరు కాకుండా ఉండలేదు. తొలి సారి గైర్హాజరవుతుండటంతో జిన్ పింగ్ ఇక అధికారాన్ని కోల్పోవడం ఖాయమని అంటున్నారు.
పన్నెండేళ్లుగా అధ్యక్షుడిగా...
చైనాను దాదాపు పన్నెండేళ్లుగా తిరుగులేని నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. తానే శాశ్వత అధ్యక్షుడిగా ఆయన రాజ్యాంగాన్ని మార్చేశారు. 2013లో చైనా అధ్యక్షుడిగా ఎన్నికైన జిన్ పింగ్ ఇప్పటి వరకూ నిరంతరాయంగా కొనసాగుతున్నారు. అడ్డువచ్చిన వారిని తొక్కుకుంటూ వెళుతూ తన పరిపాలనను కొనసాగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చైనాలో ఎంతటి గొప్ప నాయకుడు అయినా రెండు సార్లకు మించి అధ్యక్ష పదవి చేపట్టరాదు. ఒక దఫా అయిదేళ్లు, రెండో దఫా మరో అయిదేళ్ల చొప్పున మొత్తం పదేళ్లకు మించి పదవిలో కొనసాగేందుకు చైనా రాజ్యాంగం అనుమతించదు. 1982లో అప్పటి చైనా అధినేత డెంగ్ జియావో పింగ్ ఈ మేరకు రాజ్యాంగాన్ని సవరించారు. మావో అనంతరం మరో జీవితకాల నియంతృత్వ నేత ఉద్భవించకుండా, ముందుచూపుతో ఆయన ఈ మార్పును తీసుకువచ్చారు.
రాజ్యాంగాన్ని సవరించి...
ఈ మార్పునకు చెల్లుబాటు చెబుతూ అధ్యక్షుడితో పాటు ఉపాధ్యక్షుడి పదవీ కాలంపై పరిమితిని జిన్ పింగ్ ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు రాజ్యాంగాన్ని చేసిన సవరణను చైనా పార్లమెంటు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ఆమోద ముద్ర వేసింది. మొత్తం సభలో 2958 మంది అనుకూలంగా ఓటు వేశారు. రెండు ఓట్లను వ్యతిరేకంగా వేశారు. మరో ముగ్గురు సభ్యులు గైర్హాజరయ్యారు. 1954లో అమల్లోకి వచ్చిన రాజ్యాంగంలో ఇప్పటి వరకూ నాలుగు సార్లు సవరణలు చేశారు. ా సవరణ అత్యంత కీలకమైనది. ఈ సవరణ ఫలితంగా అధ్యక్షుడికి కాలపరిమితి ఉండదు. ప్రస్తుత అధ్యక్షుడు జి జిన్ పింగ్ జీవితకాలం అధ్యక్షుడిగా కొనసాగేందుకు అవకాశం ఏర్పడింది. తద్వారా జిన్ పింగ్ శక్తిమంతమైన నేతలా అవతరించారు. ఎవరైనా ఆయనను వ్యతిరేకిస్తే దానిని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలుగా పరిగణిస్తారు. వారిని తొలగించే అధికారం కూడా అధ్యక్షుడికి ఉంటుంది.
అప్పటి నుంచి ఎదురులేని నేతకు...
అప్పటి నుంచి జిన్ పింగ్ మాటకు ఎదురులేదు. తిరుగులేదు. ఆయన మాటే వేదవాక్కు. ఆయన నిర్ణయం శిలాశాసనం. మకుటం లేని మహారాజు. సర్వసామంత చక్రవర్తి. తాజా రాజ్యాంగ సవరణతో చైనా ఏక పార్టీ దేశం నుంచి ఏక నాయకుడి దేశంగా మారింది. మావో హయాంలో సాంస్కృతిక విప్లవం వంటి ఘటనల్లో ప్రజలు పెద్దయెత్తున హతులయ్యారు. దీంతో నియంతృత్వ వ్యవస్థను నివారించేందుకు సమిష్టి నాయకత్వ వ్యవస్థను అనుసరిస్తోంది. జిన్ పింగ్ కు ముందు రెండు దఫాలు 1993 నుంచి 2003 వరకూ అధ్యక్షుడిగా పనిచేసిన జియాంగ్ జెమిన్ , 2003 నుంచి 2013 వరకూ ఏడేళ్ల పాటు అధ్యక్షుడిగా కొనసాగిన హూ జింటావో ఈ వ్యవస్థను ప్రోత్సహించారు. జిన్ పింగ్ చర్యను చైనీయులు ఆమోదించకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో అంగీకరించారు.
తొలగించినట్లేనా?
జిన్ పింగ్ ను దాదాపు అధ్యక్ష పదవి నుంచి తొలగించినట్లు సంకేతాలు అంతర్జాతీయ సమాజానికి అందుతూనే ఉన్నాయి. గతనెల మొదటి వారంలో చైనాకు బెలారస్ అద్యక్షుడు అలెగ్జాండర్ వచ్చినప్పుడు కూడా పెద్దగా హడావిడి కనిపించ లేదు. జిన్ పింగ్ తండ్రి స్మారక స్థలం వద్ద కూడా ఇప్పటి వరకూ ఉన్న అధికార హోదాను తొలగించారు. ఆయన పేరు వెనక పలు అంశాల్లో హోదా కనిపించడం లేదు. అంటే జిన్ పింగ్ ను అధ్యక్షుడిగా తొలగించినట్లేనన్న వార్తలు మాత్రం బాగానే వినిపిస్తున్నాయి. అధికారాలు ఆయన చేతుల్లో నుంచి లాగేసుకున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. జిన్ పింగ్ తర్వాత అధ్యక్షుడిగా సెంట్రల్ మిలటరీ మిషన్ లో ఫస్ట్ ఛైర్మన్ గా ఉన్న జనరల్ ఝాంగ్ యూక్సియా పేరు వినపడుతుంది. మరి చైనాలో ఏం జరుగుతుందన్నది మరికొద్ది రోజుల్లోనే అంతర్జాతీయ ప్రపంచానికి తెలిసే అవకాశముంది.
Next Story