Sat Feb 14 2026 10:18:32 GMT+0530 (India Standard Time)
Bangladesh : బంగ్లా ప్రభుత్వం.. హసీనా అప్పగింత పైనే ఫోకస్ పెట్టనుందా?
బంగ్లాదేశ్ లో జరిగిన సాధారణ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఘన విజయం సాధించింది

బంగ్లాదేశ్ లో జరిగిన సాధారణ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో గత కొన్ని నెలలుగా బంగ్లాదేశలో నెలకొన్న అస్థిరతకు తెరపడినట్లయింది. రెండు దశాబ్దాల తర్వాత బీఎస్పీ బంగ్లా అధికార పీఠాన్ని అందుకుంది. 299 పార్లమెంటు స్థానాల్లో 209 గెలిచి సత్తా చాటింది. మాజీ ప్రధాని ఖాలిదా జియా కుమారుడు తారిఖ్ రెహ్మాన్ దేశ నూతన ప్రధానిగా చేపట్టనున్నారు. అయితే బంగ్లాదేశ్ లో ప్రభుత్వం మారిన తర్వాత మాజీ ప్రధాని షేక్ హసీనాను భారత్ నుంచి బంగ్లాదేశ్‌కు అప్పగించాలని మరోసారి స్పష్టం చేసింది. ఆమెపై కేసులు ఎదుర్కొనేందుకు భారత్ ప్రభుత్వం పంపించాలని కోరింది.
నేరస్థుల అప్పగింతపై...
హసీనా నేరస్థుల అప్పగింతపై విదేశాంగ మంత్రి ఇప్పటికే వాదనలు వినిపించారు. తాము కూడా అదే అభిప్రాయంలో ఉన్నామని, చట్టం ప్రకారం ఆమెను అప్పగించాలని ఎప్పటికప్పుడు కోరుతున్నామని తెలిపారు. ఇది రెండు దేశాల విదేశాంగ మంత్రిత్వ శాఖల మధ్య విషయమని, విచారణ ఎదుర్కొనేందుకు ఆమెను బంగ్లాదేశ్‌కు పంపాలని భారత్ ప్రభుత్వాన్ని కోరామని అని బీఎన్పీ సీనియర్ నేత సలావుద్దీన్ అహ్మద్ చెప్పారు. భారత్ సహా అన్ని పొరుగు దేశాలతో బంగ్లాదేశ్ సాధారణ సంబంధాలే కోరుకుంటుందని అన్నారు. పరస్పర గౌరవం, సమానత్వం ఆధారంగా స్నేహపూర్వక సంబంధాలు కావాల్సి ఉంటుందని అహ్మద్ స్పష్టం చేశారు.
ఢిల్లీలోనే ఉంటున్న...
ఈ వ్యాఖ్యలు గురువారం జరిగిన సాధారణ ఎన్నికల్లో బీఎన్పీ ఘన విజయం సాధించిన వెంటనే వచ్చాయి. ఆగస్టు 2024లో జరిగిన భారీ ప్రజా ఉద్యమం తర్వాత ఇదే తొలి ఎన్నిక. ఆ ఉద్యమం కారణంగా హసీనా భారత్‌కు వచ్చేశారు. ఇక్కడే ఆశ్రయం పొందుతున్నారు. న్యూఢిల్లీ లో నివాసం ఉంటున్న హసీనాకు 2025 నవంబరులో ప్రత్యేక ట్రైబ్యునల్ గైర్హాజరీలోనే మరణశిక్ష విధించింది. 2024 ప్రజా ఉద్యమాన్ని అణచివేసిన ఘటనలపై మానవత్వానికి వ్యతిరేక నేరాల కేసులో ఈ తీర్పు ఇచ్చింది. ఎన్నికల సమగ్రతపై వచ్చిన విమర్శలను అహ్మద్ కొట్టిపారేశారు. హింస, కేసుల దర్యాప్తు కారణంగా అవామీ లీగ్ కార్యకలాపాలను తాత్కాలిక ప్రభుత్వం నిషేధించిందని, ఆ నిర్ణయంతో ఆ పార్టీ ఎన్నికలకు దూరమైందని తెలిపారు.
Next Story

