Fri Dec 26 2025 03:54:54 GMT+0000 (Coordinated Universal Time)
Bangladesh : బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న ఆందోళనలు.. పోలీసులు అప్రమత్తం
బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి

బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మరొక హిందూ వ్యక్తిని స్థానికులు కొట్టి చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇదే దేశంలో కొద్ది రోజుల క్రితం మరో హిందూ వ్యక్తి హత్యకు గురైన ఘటన తర్వాత ఇది చోటుచేసుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. రాజ్‌బరి పట్టణంలోని పాంగ్షా ఉపజిల్లాలో ఈ ఘటన జరిగింది మృతుడిని అమృత్ మండల్‌గా గుర్తించారు. మృతుడు గ్యాంగ్ ఏర్పాటు చేసుకుని బెదిరింపులు, అక్రమ వసూళ్లు, ఇతర నేరాల్లో పాల్గొన్నాడని పోలీసులు చెప్పారు. ఘటన జరిగిన రోజున మండల్ తన అనుచరులతో కలిసి ఓ ఇంటి వద్ద డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అతడిని తీవ్రంగా కొట్టారు అని నివేదికలో పోలీసులు పేర్కొన్నారు.
ఆసుపత్రికి చేరుకునే లోపు...
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మండల్‌ను తీవ్ర గాయాల స్థితిలో రక్షించారు. అతడిని ఆస్పత్రికి తరలించగా, తెల్లవారుజామున సుమారు 2 గంటలకు వైద్యులు మృతిగా ప్రకటించారు అని పాంగ్షా సర్కిల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దేబ్రత సర్కార్ తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం రాజ్‌బరి సదర్ ఆస్పత్రి మృతదేహాల గదికి పంపించారు. దిపు దాస్ మైనర్ కుమారుడు, భార్య, తల్లిదండ్రులను ప్రభుత్వం ఆదుకుంటుందని మధ్యంతర ప్రభుత్వం ప్రకటించింది. గత ఏడాది ఆగస్టులో అప్పటి ప్రధాని షేక్ హసీనాను పదవి నుంచి తొలగించిన తర్వాత బంగ్లాదేశ్‌లో మైనారిటీ వర్గాలపై పలు ఘటనలు చోటుచేసుకున్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి
మతపరమైన దాడి కాదని...
ఘటన తర్వాత మండల్‌తో ఉన్న చాలా మంది పరారయ్యారు. అయితే ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. మండల్‌పై హత్య కేసు సహా కనీసం రెండు కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనుస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఇది మతపరమైన దాడి కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. వారం రోజుల క్రితం మైమెన్సింగ్లో దీపూ దాస్ అనే మరో హిందూ వ్యక్తిని దైవదూషణ ఆరోపణలపై కొట్టి చంపి మృతదేహానికి నిప్పు పెట్టిన ఘటన దేశవ్యాప్తంగా ఆందోళనకు దారి తీసింది. ఆ కేసులో ఇప్పటివరకు 12 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ ఘటనపై ఢాకా తో పాటు పలు ప్రాంతాల్లో కార్మికులు, విద్యార్థులు, హక్కుల సంఘాలు నిరసనలు చేపట్టాయి. భారత్ కూడా తన ఆందోళనను వ్యక్తం చేసింది.
Next Story

