Fri Dec 05 2025 11:27:16 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి.. అనుమానాలు ఇవే
హైదరాబాద్ లోని మియాపూర్ లో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు

హైదరాబాద్ లోని మియాపూర్ లో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. అనుమానాస్పద స్థితిలో ఐదు మృతదేహాలు పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఒకే కుటుంబానికి చెందినవారిగా స్థానికులు వెల్లడించారు. మృతుల్లో అత్త, మామ, భార్య, రెండేళ్ల చిన్నారి ఉన్నారు. ఘటనాస్థలికి వెళ్లి పోలీసులు విచారిస్తున్నారు. మియాపూర్ పోలీసులుమాత్రం అనుమానాస్పద మృతిగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అన్ని కోణాల్లో...
ఆర్థిక కష్టాల వల్ల బలవన్మరణం పొందారా? లేక మరే ఇతర కారణాలతో మరణించారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఫుడ్ పాయిజినింగ్ అయిందన్న స్థానికుల ఆరోపణల నేపథ్యంలో ఆ దిశగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కర్ణాటక నుంచి ఉపాధి నిమిత్తం వచ్చి ఇక్కడ విగతజీవులుగా మారడాన్ని స్థానికులు తట్టుకోలేకపోతున్నారు. అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కర్ణాటకకు చెందిన వారిగా...
మృతులు కర్ణాటకలోని గుల్బార్గాకు చెందిన వారిగా గుర్తించారు. గుల్బర్గా జిల్లా సేడం మండలం రంజోలికి చెందిన అరవై ఏళ్ల లక్ష్మయ్య, యాభై ఐదేళ్ల వెంకటమ్మ, ముప్ఫయి రెండేళ్ల అనిల్, ఇరవై నాలుగేళ్ల కవితతో పాటు మరొక చిన్నారి కూడా ఉన్నారు. వీరంతా ఉపాధికోసం వచ్చి కూలీ పనులు చేసుకంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ ప్రాంతంలో అద్దెకు దిగి ఈరోజు ఆ ఇంటిని ఖాళీ చేయాల్సి ఉందని కూడా స్థానికులు అంటున్నారు. పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

