Fri Dec 05 2025 09:59:52 GMT+0000 (Coordinated Universal Time)
Sigachi Industry Accident : పది మంది జాడ ఇక కష్టమేనా? ఆశలు వదులుకోవాల్సిందేనా?
పాశమైలారం సిగాచి పరిశ్రమలో ఇంకా పది మంది కార్మికుల ఆచూకీ లభించలేదు.

పాశమైలారం సిగాచి పరిశ్రమలో ఇంకా పది మంది కార్మికుల ఆచూకీ లభించలేదు. గత ఐదు రోజుల నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్న పది మంది కార్మికుల మృతదేహాలను మాత్రం దొరకలేదు. ఇప్పటికే పేలుడుతో కూలిపోయిన భవనం శిధిలాలను తొలగించినప్పటికీ కార్మికుల జాడ తెలియకపోవడంతో వారి కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అన్ని భవనాల వద్ద క్షుణ్ణంగా తప్పిపోయిన కార్మికుల కోసం వెతికినా ఫలితం కనిపించడం లేదు. కొన్ని చోట్ల శరీర విడిభాగాలు లభించడంతో వాటిని ఫోరెన్సిక్ నిపుణులకు పంపి డీఎన్ఏ పరీక్షల ద్వారా నిర్ధారించాలని నిర్ణయించారు. కొన్ని చోట్ల ఎముకలు మాత్రమే లభించడంతో కార్మికుల శరీరభాగాలు కావచ్చని భావిస్తున్నారు.
పరిహారం కోసం కొందరు డ్రామా...
ఇక పది మంది కార్మికుల ఆచూకీ లభ్యం కావడం కష్టమేనని సహాయక బృందాలు కూడా అంచనాకు వచ్చాయి. మరొకవైపు కార్మికుల కుటుంబాలు మాత్రం అక్కడే ఉండి తమ వారి జాడ కోసం వేచిచూస్తున్నారు. ఒక దశలో అక్కడి సిబ్బందిపై ఆగ్రహంతో తమ వారు ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు. మంత్రులను కూడా వదిలిపెట్టకుండా నిలదీస్తున్నారు. ఫొటోలను చూపిస్తూ అక్కడ వారిని ఆచూకీ కోసం అడుగుతుండటం మనసును కలచివేస్తుంది. అలాగే ఇంకొందరు కోటి రూపాయల నష్ట పరిహారం ప్రకటించిన వెంటనే కార్మికుల బంధువల మంటూ కొందరు దొంగ ఏడుపులు కూడా ఏడుస్తున్నారు.
అరవై మంది సురక్షితంగా...
సిగాచీ పరిశ్రమలో ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 143 మంది కార్మికులు విధుల్లో ఉన్నారని యాజమాన్యమే చెబుతుంది. అందులో అరవై మంది సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. మరో 35 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మరో 38 మంది వరకూ మరణించినట్లు ఇప్పటికి అధికారులు తేల్చారు. మార్చురీలో గుర్తించని మృతదేహాల కంటే ఆచూకీ తెలియని వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే బంధువులకు సమాధానం చెప్పలేక అధికారులు కూడా ఒక దశలో విసుక్కుంటున్నారు. మార్చురీ, ఆసుపత్రిలో లేకపోతే ఇక దొరకడం కష్టమేనని అంటున్నారు. ఇప్పటి వరకూ 31 మృతదేహాలను మాత్రమే గుర్తించారు. ఇంకా పరిశ్రమ వద్ద కార్మికుల బంధువుల రోదనలు మిన్నంటుతూనే ఉన్నాయి.
Next Story

