Fri Dec 05 2025 12:24:21 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : జనంలోకి ముఖ్యమంత్రి.. భద్రతను పక్కన పెట్టేసి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిత్యం ప్రజల్లో ఉండాలని కోరుకుంటారు. ఏ ఈవెంట్ ను అయినా వదులుకోరు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిత్యం ప్రజల్లో ఉండాలని కోరుకుంటారు. ఏ ఈవెంట్ ను అయినా వదులుకోరు. ప్రజల్లో ఒకడిగా మెలిగేందుకు నిరంతరం ప్రయత్నిస్తుంటారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ కు భిన్నంగా ప్రయత్నించాలన్నది రేవంత్ రెడ్డి అభిప్రాయంగా ఉంది. గతంలో కేసీఆర్ జనంలోకి పెద్దగా వచ్చేవారు కాదు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ సందర్భం వచ్చినా వెంటనే జనంలోకి వెళ్లిపోవాలని చూస్తారు. ప్రొటోకాల్ ను పక్కన పెడతారు. భద్రతను గురించి పట్టించుకోరు. తేడా చూపించాలన్నది ఆయన ఉద్దేశ్యంగా కనిపిస్తుంది. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా గణేశ్ నిమజ్జనం సందర్భంగా నిమజ్జనం జరిగే సమయంలో జనంలోకి వచ్చి వారిలో కలసిపోయారు.
ట్యాంక్ బండ్ పైకి వచ్చి...
రాజకీయం కోసమే కాదు.. తాను డిఫరెంట్ ముఖ్యమంత్రిగా ఉండాలని రేవంత్ రెడ్డి భావిస్తారు. అందుకే ఇటీవల హైదరాబాద్ లో వరదలు సంభవించిన సమయంలోనూ నేరుగా వెళ్లి బాధితులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి స్వయంగా తమ వద్దకు రావడంతో ఆయనకు తమ బాధలను బాధితులు చెప్పుకునే వీలు కలిగింది. తాజాగా వినాయక నిమజ్జనంసందర్భంగా కూడా రేవంత్ రెడ్డి అక్కడకు వస్తారని ముందుగా అధికారులకు కూడా సమాచారం లేదు. ఒక్కసారిగా వచ్చి అందరినీ ఆశ్చర్యపర్చారు. ట్యాంక్ బండ్ మీద నిమజ్జనాలు జరుగుతున్నప్పుడు నేరుగా వచ్చి భక్తులతో కలసి పోయారు. తనను గుర్తుపట్టిన భక్తులతో మాట్లాడారు. ఏర్పాట్లను గురించి అడిగి తెలుసుకున్నారు. వారితో కరచాలనం చేశారు.
సాధారణ భక్తుడిలా వచ్చిన...
సాధారణ భక్తుడిలా వచ్చిన రేవంత్ రెడ్డిని చూసి భక్తులతో పాటు అక్కడి అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. సాధారణ భక్తుడిలా వచ్చి గణపతి బప్పా మోరియా అంటూ ఆయన నినాదాలు కూడా చేశారు. దీంతో భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సింప్లిసిటీని చూసి అందరూ నివ్వెర పోయారు. రాజకీయంగా ఇది ఎంత మాత్రం ఉపయోగపడుతుందన్నది పక్కన పెడితే జనంలో ఒకరిగా మెలిగే ముఖ్యమంత్రి తమకు లభించాడన్న అభిప్రాయం జనంలో మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది. రేవంత్ రెడ్డి రాకతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులు గణేశ్ నిమజ్జనం చేయడంతో పాటు అంతా సజావుగా జరిగిపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
Next Story

