Fri Dec 05 2025 23:16:41 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : కోట్లు సంపాదించాలంటే..ఈ ఉద్యోగమే బెటరా? వీళ్లను చూస్తే?
తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు జరిపిన దాడుల్లో విద్యుత్తు శాఖ ఏడీఈ అంబేద్కర్ ఇంట్లో వందల కోట్ల ఆస్తులు బయటపడ్డాయి

తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు జరిపిన దాడుల్లో విద్యుత్తు శాఖ ఏడీఈ అంబేద్కర్ ఇంట్లో వందల కోట్ల ఆస్తులు బయటపడ్డాయి. అంబేద్కర్ సన్నిహితుడి ఇంట్లోనే రెండు కోట్ల రూపాయల కరెన్సీ కట్టలు బయటపడ్డాయి. అబేంద్కర్ సన్నిహితులు, కుటుంబసభ్యులు, బినామీ ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు జరుపడంతో వందల కోట్ల ఆస్తులు బయటపడ్డాయి. అంబేద్కర్ విద్యుత్తు శాఖ లో ఉన్నతాధికారి కాదు. ఒకరకంగా చూస్తే సాధారణ ఉద్యోగి మాత్రమే. ఎందుకంటే ఏడీఈ అంటే అసిస్టెంట్ డిప్యూటీ ఇంజనీర్ మాత్రమే. అయినా సరే ఇన్నికోట్ల సంపాదన ఎలా సంపాదించారన్న దానిపై అవినీతి నిరోధక శాఖ అధికారులే నోళ్లు వెళ్లబెట్టారంటే అతిశయోక్తి కాదు. ఇక ఉన్నతాధికారుల సంపాదన ఎలా ఉంటుందోనన్న చర్చ మొదలయింది.
కోట్ల రూపాయల నగదు.. స్థిరాస్థులు...
ఇబ్రహీంబాగ్ విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ ఇంట్లో ఏసీబీకి పట్టుబడ్డ అక్రమ సంపాదన నివ్వెరపర్చింది. కట్టలు కట్టలుగా కరెన్సీ కట్టలు బయటపడ్డాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణ నేపథ్యంలో ఇబ్రహీంబాగ్ విద్యుత్ శాఖలో విద్యుత్ ఏడీఈ గా పనిచేస్తున్న అంబేద్కర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఏడీఈ బంధువులు, కుటుంబ సభ్యుల ఇళ్లలో అధికారులు మొత్తం పదిహేను బృందాలుగా విడిపోయి గచ్చిబౌలి హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాల్లో పలుచోట్ల సోదాలు చేశారు. ఈ క్రమంలో తనిఖీల్లో భాగంగా భారీ ఆస్తులు బయటపడ్డాయని అవినీతి నిరోధక శాఖ అధికారులు వెల్లడించారు. ఇంకా బ్యాంక్ లాకర్లు కూడా తెరవాల్సిఉంది.
అడ్డగోలు సంపాదనతో...
గచ్చిబౌలిలో ఖరీదైన భవనం గుర్తించినట్లుగా ఏసీబి డీఎస్పీ ఆనంద్ వెల్లడించారు. అంబేడ్కర్ బినామీ సతీష్ ఇంట్లో రెండు కోట్ల రూపాయల నగదు గుర్తించామన్నారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లాలోనీ పెన్ పహాడ్ లో 10 ఎకరాలు వ్యవసాయ భూమిని అంబేద్కర్ కొనుగోలు చేశారని పేర్కొన్నారు. అక్కడే మరో వెయ్యి గజాల్లో వ్యవసాయ ఫామ్ హౌజ్ కూడ ఉన్నట్లుగా గుర్తించామని అవినీతి నిరోధక శాఖ అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వం దీనిపై అంతర్గత విచారణకు ఆదేశాలు జారీ చేసింది. తనిఖీలు లేకపోవడం, ఉన్నతాధికారులు ఫీల్డ్ లెవెల్ లో పర్యటించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకోక పోవడం వల్లనే ఇలా అడ్డగోలుగా సంపాదిస్తున్నారన్నది వాస్తవం.
Next Story

